Wednesday 24 June 2015

Naa Matti


                                                          14-June-2015 AndhraPrabha Sunday 

Gavidi Srinivas(13thJune1977)

వసంతరాగం
- గవిడి శ్రీనివాస్‌8886174458

క్షణం తీరిక దొరికితే చాలు
నీ ఊహలు పిచ్చిక గూళ్ళు కడతాయి
నువ్వలా తలపైవాలి
వెన్నెల్ని పువ్వుల్లా జల్లుతున్నట్లు
నీ చుంబన వర్షంలో
తడిసి ముద్దవుతున్నట్లు
ఒకటే అలజడి
నాలో మొదలవుతుంది
నీ చేతి స్పర్శతో
వెలిగిస్తావ్‌
మంత్రముగ్ధుడ్ని చేస్తావ్‌
రోజులన్నీ విరిగిపోయి
కాలగర్భంలో వొదిగిపోతున్నా
జ్ఞాపకాల్లో నీవులేని రోజు
అగాధంలో కూరుకు పోతున్నట్లే ఉంటుంది.
గతంలో నీ పరిమళాన్ని
వర్తమానంలో కూడా
నీ వసంత రాగాన్ని
నా దేహం నిండా పరుచుకుని
గుభాలిస్తూనే వుంటాను
తీరాలు దాటి
చిగురించే ఆశలతో
నా ముంగిట వాలుతావా! మరీ!!
విరబూసిన చెట్టులా
గలగలా చిరునవ్వులు రువ్వతావా! మరీ!!

కన్నుల్లో వర్షం

Sun, 26 Dec 2010, IST    vv
సన్నసన్నగా జాలువారుతూ
రెప్పల మీద తూనీగల్లా వాలింది వర్షం.
గలగలా గాజుల శబ్దంలా
చెవిలో హోరు రాగాలు
పెళ్ళి కూతురిలా ముస్తాబైన వాన
వరద సామ్రాజ్యానికి రాజులా
పాత ప్రపంచాన్ని తుడుస్తూ
కొత్త లోకానికి మార్గమవుతుంది
పుడమి వొడిలో
సరికొత్త పచ్చని కాంతులు ఉదయిస్తాయి
చినుకు చిటపటల్లో
కొత్తరాగాలు ధ్వనిస్తున్నాయి
ఆస్వాదించాలే గానీ
తడవడం ఒక సుందర దృశ్యం
తేనె ధారలు కురుస్తున్నట్లు
చిరుదరహాసం మీద
కురుల సోయగాలు విరబూస్తున్నట్లు
మెలికలు తిరిగిపోతున్న వర్షం
చెట్లు తలాడిస్తూ
ఇంధ్రధనస్సుల్ని వెదుకుతున్నాయి
కళ్ళల్లో మెరుపులు
లేత యవ్వనాల తీగల్ని శృతి చేస్తున్నాయి
ఇక ఈ వానతో లోలోన జ్ఞాపకాల
జల్లులూ కురుస్తున్నాయి
చినుకు చిగురించాక
కన్నుల్లో వర్షం దృశ్యంగా కదిలాక
మనసు మొలకెత్తకుండా ఉండనూ లేదు.్‌
- గవిడి శ్రీనివాస్‌

నీరైపోనూ...!

Sun, 11 Apr 2010, IST    -గవిడి శ్రీనివాస్‌
జొన్నసేను రేకుల్లో
మబ్బుకళ్ళు జార్చిన
పన్నీరే ఈ చిట్టిచినుకులు
పూవైపోదూ చిరునవ్వైపోదూ
చెరుకు జడల మధ్య
నిద్రను ఆరేసుకుంటే
తడి చినుకు గుండెను హత్తుకుంది
ప్రియురాలిలా! చిగురాకులా!!!
చూపులు పెనవేసుకున్నట్లు
చినుకులు అల్లుకుపోతున్నాయి
వాన
ధూళి తెరలు తీసి
అద్దంలాంటి
అరటాకు వనాల్ని ప్రసాదించింది
చినుకు విరిస్తే
కడిగేది హృదయాల్నీ సమస్త జీవరాశుల్నీ
జలాశయాల్నీ...
వాన తాకితే చాలు
బరువు మనిషి తేలికైనట్లు
తేలికమనిషి బరువౌతున్నట్లు
అంతర్గత సంద్రాలు
ఆహ్లాద కెరటాల్తో
తడిగాలులు వీస్తాయి
నీరుతగిలితే చాలు
మొలకెత్తుతాం
వటవృక్షమౌతాం
గూళ్ళు కట్టిన మబ్బులకి
చల్లని గాలులు
కొంగులతో ఊయలలూపుతాయి
గాలివీస్తే
వానలేస్తే
ప్రాణాలు ముద్దవుతుంటాయి
ఆకాశానికి రెక్కలుచాచి
బొంగరంలా
గిరికీలుకొడుతుంటే
సౌందర్యం శరీరమైనట్టు
శరీరమంతా హృదయమైనట్టు
మనసు పల్లకిలో
తేలియాడు తుంది
నేనుండగలనా
చినుకుల్ని ఛేదించగలనా
దోసిళ్ళలోంచి రాలే
చినుకుల్లా
ఒక్కధారగా
నీరైపోనూ...!
-గవిడి శ్రీనివాస్‌

Tuesday 23 June 2015

పరిమళించే భావ కుసుమాలు

  • -మానాపురం రాజాచంద్రశేఖర్
  •  
  • 06/06/2015

వలస పాట (కవితల సంపుటి)
గవిడి శ్రీనివాస్ కవిత్వం
ప్రతులకు: రచ యత
గాతాడ- 532127,
మర్రివలస (పి.ఓ)
రాజాం (ఎస్.ఓ.)
విజయనగరం (జిల్లా)
ఆంధ్రప్రదేశ్
సెల్: 08886174458, 09966550601
మనసు పడే ఆరాటం మనిషికి తెలియాలంటే జీవితం సౌందర్యవంతం కావాలి. సరికొత్త సందర్భ దృశ్యాన్ని ఏరుకుని భావచిత్రాలతో ప్రతిబింబింపజేయాలి. ఈ తపన ఆధునిక అభివ్యక్తిలోంచి భావుకతగా ఊపిరి పోసుకోవడం కళాత్మకంగా మారుతుంది. కవితాత్మకంగా అలంకారాలను రూపుకట్టిస్తుంది. ఇందులో దగ్ధసౌందర్య అనే్వషణ కూడా ఉంటుంది. వెల్లువెత్తుతున్న వర్తమాన, సామాజిక సంఘర్షణల రాపిడితో చూపుకూడా పదునుదేరుతుంది. అనుభూతి పరవళ్ళుతొక్కి ద్రవీభూత చలన స్థితితో ప్రకృతి పరిశీలనలో మునిగితేలేలా చేస్తుంది. ఈ యాంత్రిక జీవితంలోని స్తబ్దతల్ని బద్ధలుకొట్టి దానితో ఒక అనివార్యమైన ఉపశమన స్థితిని పొందడానికి వైవిధ్యమైన మార్పుల్ని, కోరుకోవటం ప్రాణికోటికి సహజం. అలాంటి ఆలోచనలకి అక్షరబీజాల్ని నాటి కవితల తోరణాలు కట్టిన కవి అంతర్ముఖ చిత్ర దర్శనం ఈ కవితా సంపుటి. 50 శీర్షికలతో విలక్షణమైన కవితాపంక్తులు ఆసాంతం రసార్ద్రపూరితం చేస్తాయి. బహుముఖ కోణాల స్పర్శతో అలసిసొలసి మోడువారిన మనసుల బతుకుల్లో వసంత కాలపు తలపుల తలుపుల్ని తెరుస్తాయి. ఈ అనుభవాల ఊగిసలాటలోంచి పరవశించిపోతూ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన కవితాదృశ్యాల్ని కొన్నింటిని వీక్షించే ప్రయత్నం చేద్దాం.
‘‘తీరాన్ని, తాకాలని/ ఆరాటపడే అలల్లా
మండుటెండ జీవితంలో మంచు బిందువుల్ని పోగుచేసి
పొడి అనుభవాలకి/ తడి స్పర్శ
ఊపిరి ఊదుతుంది’’ అంటాడు ‘అలల తాకిడి’ కవితలో ఒకచోట కవి. సందర్భాన్ని కవిత్వం చెయ్యడం అందరికీ చేతకాదు. లోచూపుతో దృశ్యాన్ని ఒడిసిపట్టుకొని అపురూప క్షణాలమధ్య పరిస్తే- ఆ అనుభూతి ఆస్వాదనే వేరు. చిరకాలం ఇంకిపోని దృశ్యంలా మనసుపొరల్లో గాఢంగా నాటుకుపోతుంది. ఇక్కడ కూడా అలాంటి తాపత్రయమే చోటుచేసుకుంది. పొడిపొడి అనుభవాలు నిరాశానిస్పృహల్ని రాజేస్తుంటే, ఎండి గడ్డకట్టుకుపోయిన విషాద సందర్భాల్లో తడిస్పర్శ కలిగించి జీవితాన్ని చైతన్యవంతం చెయ్యడం ఒక మహత్తరమైన ఘటనకు దారితీస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రయోజన ఫలితానే్న ఈ కవిత మననుంచి ఆశిస్తున్నాడు. అది సఫలీకృతం కావాలనే కోరుకుందాం.
‘కొవ్వొత్తి’ కవితలో ఇంకోచోట ఇలా చెబుతాడు.
‘‘కొద్ది సమయం/ చేతుల్లోంచి జారిపోయాక
ఎంత చీల్చినా/ ముక్కలుకాని చీకటి
శూన్య ప్రకంపనాల్ని విరజిమ్ముతోంది’’ అంటున్నపుడు ధ్వనించే వ్యతిరేక భావన పలు సామాజిక కోణాలను ప్రాపంచిక దృక్పథంతో మెలిపెట్టి చెప్పడం గమనించవచ్చు. ‘దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలనే’ తపన తీరని ఆరాటంగా కవిత్వంలో తొణికిసలాడుతోంది. కాలం విలువను పసిగట్టడంతోపాటు- మిగిలిన సమయాన్ని పొదుపుగా వాడుకోవాలనే స్పృహను కవితాత్మక దృష్టితో అధ్యయనం చేసి సూక్ష్మదృష్టితో చెబుతాడు కవి. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి.
‘‘తీరాల ఆవల/ సంకెళ్లతో నీవు
బంధనాల బందీని నేను/ గుర్తొచ్చి
జ్ఞాపకాలతో ఏం మాట్లాడను?’’ అంటూ ఎదురుప్రశ్నిస్తాడు ‘నీవు రాగలవా’ కవితలో.
వలస పేరుతో ధన సంపాదనకోసం దూర తీరాలైన విదేశాలకు ఎగిరిపోవడం రెక్కలొచ్చిన పిల్లలు చేస్తున్న పని. వాళ్ళ రాకకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూడడం పెద్దవాళ్ళ వంతయ్యింది. అందులోనూ వృద్ధాప్యంలోని ముసలివాళ్ళ గోడైతే ఆ బాధ చెప్పలేనంత వర్ణనాతీతం మరి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నవేళ... కలిసున్న ఉమ్మడి క్షణాలు తీపి జ్ఞాపకాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ మానసిక సంఘర్షణను సంక్లిష్ట సమస్యగామార్చి కవిత్వంగా మనముందు పరిచారు ఈ కవి. ఈ వెదుకులాటలో మననుంచి మనమే దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
‘వేకువ రాల్చిన కిరణాలు’ కవితలో గతంలోంచి వర్తమానాన్ని తడుముతూ, దొర్లిపోయిన అనుభవాలను అనుభూతుల ద్వారా పొందుపరిచి, గాఢతను సాంద్రతరం చెయ్యాలనే ఆవేశం కనబడుతుంది.
‘‘దూస్తున్న మంచు వెనె్నల్లోంచి/ వేకువ రాల్చిన కిరణాలకి
తుంపర భావాలు ఆవిరౌతూ/ తనువు చాలిస్తుంటాయి’’
నిత్య దినచర్యలో భాగమైన చీకటి వెలుగుల మిశ్రమ కలయిక రేయింబవళ్ళుగా పరిణామం చెంది కొత్త సూర్యోదయ ఆవిర్భావానికి దారితీస్తుంది. అలా రాల్చిన వేకువ కిరణాలకు తుంపర భావాలు ఆవిరవుతూ అదృశ్యమవడాన్ని అంతిమదృశ్యంగా పోల్చిచెప్పడం దీని ప్రత్యేకతకు నిదర్శనం. అంటే తనువు చాలించడమన్న మాట. ఇది వర్తమాన కాలానికి అన్వయించి చెప్పడమే ఈ కవి ఊహకి తట్టిన ఉద్దేశం. ఈ ప్రయత్నంలో సంప్రదాయక భావజాలంనుండి ఆధునిక సమాజాన్ని, వేరుచేసే దూరదృష్టి కనబడుతుంది.
అనుభూతి పరాకాష్ఠ దశకు చేరినపుడు ‘ఒక తుళ్లింత’ లాంటి కవిత ఊపిరిపోసుకుంటుంది.
‘‘సన్న సన్నగా/ జాలువారుతూ
రెప్పల మీద/ తూనీగలా వాలింది వర్షం’’ అని అంటాడు కవి. ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులు కారణంగా... వర్షం చినుకులుగా తూనీగ స్పర్శతో కురిసి మనసుని ఉల్లాసపరుస్తుంది. ఈ స్థితిని బొమ్మకట్టించడంలో కవి పడే ఆరాటం ఆరాధనగామారి కవిత్వంగా కురుస్తుంది.
ఇలా చెప్పుకుంటూపోతే పదాల అంచులమీద ధారగా కురిసే కవితాపంక్తులు ఎనె్నన్నో.. ఈ సంపుటిలో తారసపడతాయి. వీటి లోతుల్ని అక్షరస్పర్శతో తడిమే ప్రయత్నం చేద్దాం.
‘‘మాటలురాని వలస పక్షులు/ కాలం అంచులమీద అలసిపోతున్నాయి’’ అని అంటాడు కవి ఒకచోట. మరొకసారి వర్ణిస్తూ ‘‘విధ్వంసాలైనా/ కొన్ని సౌందర్యంగానే ఉంటాయి’’ అంటూ చెప్పుకుపోతాడు.
ఇలాంటివే ఇంకొన్నింటిని కలవరించి పలవరిద్దాం-
‘‘కిరణాల కౌగిలింతలకి/ రాలుతున్న సందర్భాలు’’, ‘‘సమస్తం ముక్కలయిన/ ఒక వాస్తవం/ ఈ జీవితం’’, ‘‘కన్నీటిని ముద్దాడే/ నీ పెదవుల స్పర్శ/ ఏ గాలికీ చెదిరిపోదు’’, ‘‘వేకువ అలల్ని/ అలా తొలిపొద్దుగా/ ఆశగా జారనీ’’, ‘‘ఎంతకూ వదలని/ కరువు బతుకు మీద/ దరువు ఈ చినుకు’’, ‘‘చరిత్ర గుండెల్ని పిండినపుడల్లా/ రాలుతున్న వలస పాటలు’’, ‘‘ఊపిరి కొనలమీద చలి రాపాడుతూనే ఉంది’’, ‘‘వొణికిన రాగాలు/ తడిసి ముద్దవుతున్నాయి’’, ‘‘కళ్ళల్లో మెరుపులు/ లేత యవ్వనాల్ని శృతి చేస్తున్నాయి’’, ‘‘రాలిన గతం/ తడిపిన జ్ఞాపకమై/ మనసు పట్టాలమీద పోతుంది’’, ‘‘చూపుల్ని ఆకాశానికి విసురుతున్నా/ చినుకు సమాధానం చిక్కలేదు’’, ‘‘ఊహల లోగిళ్లలో దృశ్యాలను వెదుకుతూ నేను’’, ‘‘గుండెల్లో శిలల్ని మరిగిస్తూ/ వెనె్నల పువ్వుల్ని రాల్చేసుకుంటాను’’, ‘‘మట్టి నరాలు తెగినచోట/ పచ్చదనం శ్వాసించదు’’, ‘‘ప్రపంచీకరణ పొదిగిన గాయానికి/ పిల్లలు పక్షులై/ ఎక్కడెక్కడో వాలడం’’, ‘‘అరమోడ్పు కళ్ళలో ఒదిగిన/ ప్రకృతి భాషాస్వరాలు’’, ‘‘చల్లని సాయంకాలానికి తెర తీసి/ కొబ్బరి రెమ్మల్లోంచి/ జారిపోతున్న సూరీడు’’, ‘‘ఎప్పటికీ తెరవని ఉపాధి ద్వారాలు/ సూర్యోదయాల్ని చీకట్లో బంధించాయి’’, ‘‘కత్తికి తెగని బాధ ఇది’’, ‘‘కాలుష్యం అడుగుల నడకలో/ నిలువునా రాల్తున్న బతుకు రాగాలు’’, ‘‘నాలో ఒక వేకువ పిట్ట/ వెలుగు రేఖల్ని/ చిన్ని కొవ్వొత్తిగా నిలుపుతుంది’’ వంటి కవితాత్మక వ్యాసాలు ఊహలకు చక్కిలిగింతలు పెట్టి సరికొత్త ఆలోచనల్ని తట్టిలేపుతాయి.
ఇలాంటి ఊగిసలాటలోంచి భావుకతకు పెద్దపీటవేసి వర్తమాన కాలానికి దర్పణంగా నిలుస్తాడు ఈ కవి. అడుగడుగునా భావచిత్రాలు, అలంకారాలతో అల్లుకుపోతాయి. ఇలా కవిత్వంతో కరచాలనం చేసిన ఈ కవి ఎవరో చెప్పలేదు కదూ. అతని పేరు గవిడి శ్రీనివాస్. తన కవితాసంపుటి ‘‘వలసపాట’’. పేరుకు తగ్గట్టుగానే ఇది ఉత్తరాంధ్ర జీవన ముఖ చిత్రాన్ని తడుముతుంది. సరళమైన కవిత్వ భాషతో సహజంగా సాగిపోతుంది. ఇంత మంచి సంపుటిని పాఠకలోకానికి అందించిన కవిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుదాం!

06-june-2015

గవిడి 'వలస పాట'

Posted On Mon 01 Jun 13:49:27.206102 2015

                 విశాఖపట్నం సాహితీ స్రవంతి ప్రచురణగా వెలువడిన కవితా సంపుటిలో 50 కవితలున్నాయి. మనసు వదిలి వలస పోని ''మట్టిపాట'' అంటూ అద్దేపల్లి రామమోహన్‌ రావు, మరలా ప్రకృతి దగ్గరికి అంటూ కె. శివారెడ్డి చక్కటి విలువైన ముందు మాటలు రాశారు. పాఠకుల్ని ప్రకృతి దగ్గరికి , సౌందర్యం దగ్గరికీ శ్రీనివాస్‌ అక్షరంతో తీసుకెళ్తారు. 'రంగుల పక్షిలా పరవశించి అనురాగ రాగాన్ని అలంకరించాను/ కాలం వొడిలో మనం గాఢంగా మౌనంగా/ మనసులు మార్పిడి చేసుకున్నాం అంటారు 'నీ జ్ఞాపకాల పొరల్లో' అనే కవితలో. 'నక్షత్రాల పువ్వుని నీటి దోసిళ్ళలోనే దాచా/ మనో వీధిలో పుష్పక విమాన మెక్కి/ నే జాతర చేస్తున్నట్లు అవిరాళ భావాల మధ్య/ శీతల సుందరిని ముస్తాబు చేస్తూ ఈ సంధ్యను ముగిస్తాను' అంటారు 'ఒక శీతల సాయంత్రం'లో. 'నీరెండిన గుండె ఎడారిలో/ విజయం అలల తాకిడి / తీరాన్ని చేరుస్తుంది. మనస్సుల్ని రంజింప చేస్తుంది' అని 'అలల తాకిడి' అనే కవితలో. ఇలా ప్రతి పంక్తిలో అలంకారమో, భావ చిత్రమో, వర్తమాన సామాజిక వైరుధ్యమో కనిపిస్తాయి. 'ఒక వీడ్కోలు' అనే కవితలోని చివరి వాక్యాలు పాఠకుణ్ని ఆర్తితో ఆలోచింపజేస్తాయి. 'కరెన్సీ భాషలో కొలవలేని/ కాలం చూరులోంచి జారే రసామృతాన్ని/ ప్రశ్నార్థకంగా వదిలి/ హృదయాన్ని ట్రాలీలో మోసుకుపోతూ/ ఈ జీవచ్ఛవాన్ని విడిచి, రెక్కలు కట్టుకు ఎగిరిపోతావ్‌' ఇలా అన్ని కవితలు భావస్ఫోరకంగా ఉన్నాయి.
- తంగిరాల చక్రవర్తి
31-may-2015 prajasakti

కవిత్వాన్ని భావుకతతో తడిపిన 'వలస పాట'

Posted On Sun 10 May 22:27:03.992043 2015
                   ప్రతి కవికి జీవితంలో ఊగిసలాట తప్పనిసరి. పలు సందర్భాల్లోంచి ఈ స్థితి చోటుచేసుకుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి కోణాల్లోంచి స్తబ్దతను బద్ధలు కొట్టడానికి చేసిన సృజనాత్మక ప్రయత్నమే కవిత్వ రచన. ఇది అప్పటి మానసిక పరిస్థితిని అద్దం పట్టిస్తుంది. సరికొత్త ఆలోచనలకు గీటురాయిగా నిలుస్తుంది. కాలం ఎలాంటిదైనా సామాజిక స్థితిగతుల నేపధ్యమే దీనికి పరోక్ష ప్రేరణ. అంతర్గత సంఘర్షణలకు అక్షరరూపమే ఈ భావ పరంపర అన్వేషణ. ఇలాంటి భావోద్వేగాల స్ఫూర్తితో ఊపిరి పోసుకున్నదే వర్తమానం కవిత్వం.
గవిడి శ్రీనివాస్‌ దశాబ్దంన్నర కాలానికి పైగా కవిత్వ ప్రక్రియతో దూసుకుపోతున్న కవి. అనేక వర్తమాన సంక్లిష్టతలతో, సామాజిక భావ వైరుధ్యాలతో నిత్యం రగిలిపోతూ ఆరాటపడటం అలవాటు చేసుకున్నాడు. ఈ నేపధ్యంలోంచి తనదైన కవిత్వ గొంతుతో 'వలసపాట' కవితా సంపుటిని తీసుకొచ్చాడు. ఇది రెండవది. అంతక మునుపు 'కన్నీళ్ల సాక్ష్యం'తో సాహితీలోకంలోకి అడుగుపెట్టాడు. ఈ సారి వేసిన అడుగు చాలా బలంగా, చిక్కగా, కవితాత్మాకంగా ఉంది. భావుకత వెల్లువెత్తి అడుగడుగునా మనల్ని చుట్టుముడుతుంది. ఈ తపనంతా ఇతని కవిత్వంలో తొణికిసలాడుతుంది. 'అలల తాకిడి' కవితలో తన అభిప్రాయాన్ని సునిశితమైన పరిశీలనతో కుండబద్దలు గొట్టినట్లుగా చెబుతాడు.
''కాలాలు ఎన్ని నడిచినా/ శ్రమకు ఉపశమనం
చీకటికి ఉషోదయం/ అనివార్యమే' అంటాడు శ్రీనివాస్‌. ఇలా అంటున్నప్పుడు గవిడిమాటల్లో జీవన వాస్తవికత తొంగిచూస్తుంది. ఆలోచనా విధానంలో స్పష్టత గోచరిస్తుంది. జీవితాన్ని కాచి ఒడబోసిన అనుభవం రూపుకడుతుంది. శారీరక శ్రమకు విశ్రాంతిని చీకటి మింగిన వెలుగులోనే ఉందనే సత్యాన్ని పాఠక ప్రపంచానికి గుర్తుచేస్తాడు.
'విష వలయం' శీర్షికలో ఆధునిక సమాజంలోని యాంత్రికతనాన్ని డొల్లతనంగా బయటపెడతాడు. నవ నాగరికతలోని ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యాన్ని కళ్ళకు కట్టిస్తాడు శ్రీనివాస్‌.
''బాస్‌ సెల్లుమోత మనసుని ఛిద్రం చేసి / గ్లోబల్‌ గీతలు గీసి/ టార్గెట్‌ విషాన్ని చిమ్ముతూ/ కొసమెరుపుగా ఆశను వేలాడదీస్తుం'' వర్తమాన సందర్భాన్ని అక్షరీకరించడంలో ఆరితేరినతనం కనిపిస్తుంది ఇందులో. అంతర్జాతీయ విఫణిలో సంక్లిష్టమవుతున్న మానవ జీవితాలన్నీ జీతపురాళ్ళకు అమ్ముడుపోయిన తీరును బహిరంగ ప్రకటన ద్వారా విశదపరుస్తాడు కవి. దీనికి కొనసాగింపుగా మరోచోట - వ్యాపారమయమైపోతున్న క్షణాల్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తాడు.
''వ్యాపార విష సంస్కృతి రెక్కలు చాస్తుంటే
ఉనికి ప్రశ్నలు మొలుస్తున్నాయి'' అని అంటున్నప్పుడు - బతుకు మీద భరోసాని కోల్పోతున్న సందర్భాన్ని చాలా విషాదభరితంగా చెప్పుకొస్తాడు. ప్రపంచీకరణ వేళ్లు అన్ని రంగాల్లోకి చొరబడి విష సంస్కృతి రూపంలో విస్తరించడాన్ని ప్రశ్నార్ధకంగా ప్రస్తావిస్తాడు గవిడి శ్రీనివాస్‌.
పెట్టుబడిదారి సమాజం కారణంగా స్వేచ్ఛని, తీరికనీ, సుఖసంతోషాల్నీ కోల్పోతున్న ఆధునిక మానవుడు తన సహజ స్థితిని చేరుకోవడానికి కాసింత విరామం అవసరం. కళాత్మక సౌందర్య దృష్టిని ఆస్వాధీంచగలగడం - అలసిన దేహాలతో పాటు మనసుకీ ఊరటనిస్తుంది. ఈ తరుణంలో శ్రీనివాస్‌ ఎంచుకున్న పదచిత్రాలు పాఠకుల మీద చెరగని ముద్ర వేస్తాయి. కవితను దృశ్యీకరించే పద్ధతిలో ఒక బలమైన ఊహాశక్తిని సరళమైన పదబంధాల మధ్య పొందుపరుస్తాడు. ఈ క్రమంలో తనదైన నిర్మాణ పద్ధతిని ప్రదర్శిస్తాడు.
''ఊగే ఈ గాలిలో/ ఈ నేలలో/ గుండెను తడిపే
విశ్వజనీన భాష ఏదో ఉంది'' అని అంటాడు మరో చోట.
ఒక సందర్భాన్ని కవిత్వం చెయ్యడం, దృశ్యమానంగా కొనసాగించడం సాధనతో సాధ్యమయ్యే పని. స్వతహాగా భావుకుడైన గవిడి శ్రీనివాస్‌కి ఈ ప్రయత్నం వెన్నతో పెట్టిన విద్యలోచూపుతో పదును తీరిన అంతర్వీక్షణ దృష్టి కొత్తకోణాల్ని స్పృశిస్తుంది. సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశీలనా శక్తికి పరీక్ష పెడుతుంది. ఈ దశలన్నింటినీ నెగ్గుకు రావడానికి పైకి కనిపించని మూల సూత్ర రహస్యాన్ని విభిన్న పార్శ్వాల్లో మన ముందు పరుస్తాడు శ్రీనివాస్‌.
'నేను లేత సూర్యుడు' కవితలో శ్రీనివాస్‌ ప్రదర్శించిన నేర్పు సహజ సౌందర్యాన్ని ధ్వనింపజేసి కళ్లకాంతులు మిరమిట్లు గొలిపేలా చేస్తుంది.
''నెమ్మదిగా తలూపే చెట్టునూ/రాల్తున్న మందుముత్యాల్ని
ఎగురుతున్న హరివిల్లులా / పక్షుల గుంపుల్ని/ నిశ్శబ్దంగా కళ్లు మూసుకొని - దృశ్యాన్ని నాలో వీక్షిస్తున్నాను'' అంటూ ఒక గాఢానుభూతిలోకి మనల్ని లాక్కెళ్ళిపోతాడు. పోలికలు చెప్పడంలో అనిర్వచనీయమైన ఆనంద పారశ్యంతో అంతరాల పొరల్ని చీల్చుకొని మమేకమైపోవడాన్ని గమనిస్తాం. ఇలా ఎక్కడపడితే అక్కడ.. ఈ సంపుటి నిండా కవిత్వం ధారలు కడుతుంది. వీటిలో మచ్చుకు కొన్నింటిని రుచి చూద్దాం.
''నీ జ్ఞాపకాల సమాధిలో / ఒక నీవు సాక్షిగా/ రాలిన నేను'', ''క్షణాల్ని ఢ కొంటూ/ చలి జ్వరాన్ని వాటేసుకున్నట్టు/ పల్లె నిశ్శబ్దంగా వొణుకుతోంది'', ''జొన్నసేను రేకుల్లో/ మబ్బుకళ్లు జార్చిన పన్నీరే/ ఈ చిట్టి చినుకులు'', ''ఒళ్ళంతా పరిమళమే/ మేఘాల్ని ముద్దాడితే/ మౌనాన్ని వీడి చినుకు చిత్తడి చేయదూ, ''ప్రపంచీకరణ ఇంద్రజాలం/ భూములకి రెక్కలిచ్చి/ ఆశల్ని ఆకాశానికి వేలాడదీస్తున్నాయి'', ''కాలానికి తెడ్లు కట్టి/ నావ దూకినపుడే/ బతుకులో ఉషోదయానికి తెర తీసినట్టవుతుంది'', ''వేణువులోంచి జారే/ రాగమాలిక నీ స్వరం/ కానీ ఇపుడు వినిపించని దారుల్లో'', '' నడిరాతిరి నీ జ్ఞాపకాలు/ ఉషస్సునే కలగంటాయి'' వంటి కవితా వాక్య నిర్మాణాలు స్తబ్దుగా నిద్రపోతున్న చీకటి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. వత్తానమ్మా, నాయనలారా ఎళ్లొత్తాన్రా కవితలు ఉత్తరాంధ్ర మాండలిక శైలిని ప్రతిబింబిస్తాయి.
ఎంతో గాఢత నిండిన ఈ కవితలు స్పష్టతను నింపుకొని, వస్తు విస్త్రృతిని పెంచుకొంటే భవిష్యత్తుని మరిన్ని కొత్తమలుపులు తిప్పుకొనే శక్తివుంది ఈ కవికి. సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాల్ని, విధ్వంసాన్ని గుర్తెరిగి, అధ్యయనంతో ముందుకు దూసుకుపోతే, కవిత్వపు నడక నల్లేరుపై బండినడకలా సాగిపోతుంది. ఈ దిశగా గవిడి శ్రీనివాస్‌ అడుగులు చైతన్యవంతమైన పాత్రను పోషించాలని కోరుకుందాం!
- మానాపురం రాజా చంద్రశేఖర్‌
94405 93910

వొణికిన భూకంపం

  • - గవిడి శ్రీనివాస్, 08886174458
  •  
  • 04/05/2015

ఊహించని క్షణాలు
రెక్టారు స్కేల్ మీద
ఊగుతున్నాయ్.
పొరల దొంతరల్లో
కదిలికే ఏమో
కలలు చిట్లినాయ్
గాలి వీస్తున్నపుడు
నేలకొరిగిన చెట్టుల్లా
రాలిపడ్డ నేపాల్
దేహం మనుషులదైనా
ఊహకు ముడిపడని
కాలం అంచులమీద
కన్నీటి శిల్పాలు
ఎందుకనో కొన్నింటి రెక్కల చప్పుడు
పసిగట్టలేం
కొన్నింటిని నిబిడాశ్చర్యంతో చూస్తాం
చెక్కిళ్ళ మీద
కన్నీటి చుక్కల్లా
జారిపోతున్న ప్రాణాలు...!
కళ్ళెదుట దృశ్యాల్ని
చలించే గుండెతో వీక్షించి
చేయూత కర్రలా
సాగాల్సిన క్షణాల్లో
ప్రణమిల్లుతున్నాం



సముద్రం ఒక ఊరట


Posted On Sun 26 Apr 22:01:20.870971 2015
జడలు పాయలు అల్లినట్లు 
నూనె రాసుకుని నిగనిగలాడినట్లు 
ఉయ్యాలలూగుతూ కడలి 
ఉత్సాహాన్ని కెరటంలా విసురుతుంది
నిర్వేదం అల్లుకుని
బోర్లాపడినపుడు
అనంతమైన ఆశలని రేపి
మనసుని తడుపుతుంది

ఒక్కో సారి సంద్రం మీద
ఊహించని ప్రపంచాలతో
ఈ జాలరి జీవితాలు
సతమతమవుతుంటాయి
నావలో ఒంటరిగా నక్షత్రాలని చూస్తూ
వలలో చిక్కుకున్న నక్షత్రాలని
చేపలుగా ఏరుకుంటాం!
కొద్దిదూరం పోయాక
వర్షం పువ్వులై రాలుతుంది
గొడుగు వొళ్ళు విరుచుకుంటుంది
కాసేపు గొడుగు చుట్టూ రాలిన
నీటిముత్యాలని ఏరుకుంటాం
సముద్రంలో పొద్దుపోయాక
చీకట్ల వాన కురుస్తున్నపుడు
సూర్యగోళాన్ని గొడుగులా
ఎక్కి పెట్టాలనుకుంటాం!

ధైర్యంముంటే చాలు
ఎల్లలు లేని విశ్వాన్నే ఛేదిస్తాం
గుండె గుబురులలో
మంటలు రేగుతున్నపుడే
సంద్రం వంకా
ఆశలని నడిపిద్దాం
దిగులు దివ్వై వెలిగి
ఆశని ఆకాశానికి
తారాజువ్వలా తీసుకుపోతుంది
- గవిడి శ్రీనివాస్‌
(+91)8886174458