Sunday 13 March 2016

ఆకురాలే కాలం

ఆకురాలే కాలం

యవ్వనం మొగ్గ తొడిగి లేతప్రాయం
వెన్నెల గొడుగు కింద కలల్ని వేలాడదీసుకుంది
సహవాసాలు అభిమానాలు తెలియని బంధమై
అల్లుకుపోయి జీవితంగా ముడివేసుకుంటున్నాయి
కన్నె వయసు ఊహలన్నీ ఊసులన్నీ పదిలంగా
హృదయం లోకి ప్రవేశించాక తొంగిచూసిన
క్షణాల్లో ఏడడుగుల బంధంలోకి ప్రవేశించాం
రోజులు పెనవేసుకున్నాయి కాలం కబుర్లు చెప్పుకుంది
అనుభూతులు ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించాయి
ఏమైందో ఏమో ఆకు రాలే కాలం తడితడిగా
తడుముతోంది నన్ను తరుముతోంది
తోడై నిలవాల్సినవాడే కన్నీళ్ళ బుట్టను
నెత్తిన ఎత్తి జాడే లేని చోటుకి జారిపోయాడు
రెక్కలూపుతున్నపాపతో నా పూల కొట్టు లో
ఓదార్చే ప్రతి పువ్వులో అతని కోసం
రెప్పవాల్చని ఆశలతో ముసురుతున్నకాలాన్ని
కాస్తంత బరువుగానే ముందుకుతోస్తున్నాను