Sunday 29 December 2019

koddi gaa



https://epaper.vaartha.com/c/47414272
https://epaper.vaartha.com/2483255/Sunday-Magazine/29-12-2109?fbclid=IwAR3rHvC3m6b67-JwvM8uJn3s6iWdv_qyupkHWoY9ljEK7V7UOE5MjcLKgDc#page/23/1


Saturday 31 August 2019

ఓ దుఃఖ ప్రవాహం

ఓ దుఃఖ ప్రవాహం
Published Saturday, 24 August 2019
ఈ దుఃఖ ప్రవాహాన్ని ముక్కలు చేయలేకపోతున్నాను
నీరెండిన బతుకులాంటి జీవన ప్రవాహంలో
వేలాడే దృశ్యాల్ని ఎటూ నెట్టలేకపోతున్నాను
బదులివ్వలేని ప్రశ్నలతో సతమతవౌతూ
ఏళ్లనాటి దుఃఖాన్ని రెండు నదులుగా
ముఖ గోళంపై జార్చుకుంటూ...
ఒక సమయానికి వచ్చే నీ రాకే
నాలో ఎత్తుపల్లాలు తెలీని ఆనందంలో ముంచేది
కొండలు ఎక్కి వాగులు దాటి తోటలు తిరిగి
నీలో పొంగిన నా ఆనందాన్ని
నీతో నడిచే వికాసాన్ని నాలో చూసుకునేవాడిని..
కాలమెంత కఠినమైనదో కదా
మనసు నొదిలి
ఆ క్షణం నిర్ణయాలు వెలుగుల వెంట
పరుగులెత్తాయి.
సూర్యోదయం నీతో అయినట్లే
సూర్యాస్తమయం నీతోనే ముగిసింది
దిక్కులు మారాయి
మనసులు బరువెక్కాయి
రెక్కలే ఉంటే ఏ దిక్కున నీవున్నా
నీ ముంగిట వాలేవాడిని
ఆ రోజులు లేవు
రాతిరి పూట
నిదురించే ఆకాశంపై చందమామను
ఒక దగ్గర నుంచి చూసే రోజుల నుంచీ వేరయి...
ఇప్పుడు చెరో దిక్కు నుంచీ చూస్తున్నాం
రాని వెనె్నల కోసం ఆరాటపడుతూ...
-గవిడి శ్రీనివాస్.. 9966550601

Saturday 17 August 2019

దర్పణం

ఆదివారం

దర్పణం

సరోవరంలో గుంపులుగా వేలాడే పక్షులు
ఆకాశాన్ని వేరు చేసి మబ్బుల మధ్య ఈదుతున్నాయి
కళ్లనిండా ఆశల సంద్రాలు పొంగుతున్నాయి
వెనుకటి పాదముద్రలు హృదయాంతరాలలో చిక్కుకుని
రేపటి స్వప్నాలికి అడుగులు తడబడుతున్నాయి.
చిగురించే జీవితం రెక్కలు కట్టుకు ఊగుతోంది
ఏమీ తోచనప్పుడు నిశ్శబ్దం పిండుతున్నపుడు
ఒంటరి లోకంతో సహజీవనం గావిస్తున్నపుడు
లోపలికి అవలోకిస్తున్నపుడు
గుప్పెడు మాటలు ఒలికితే
ఆనంద ప్రవాహాలు రెప్పలు తెరుచుకుంటాయి
మెలికలు తిరిగే ఆలోచనల నడుమ
దాచుకోలేని వసంతాల నడుమ
నలుగురి మనుష్యుల మధ్య చిరునవ్వుగా వికసిస్తాను
నాలో అంతరంగం
ఇప్పటి క్షణాల్ని కాస్త ముందుకి జరిపి
లోలోపలి దర్పణంలోంచి
బయటికి ప్రతిబింబిస్తూ ముందుకి ఉరుకుతుంది.
-గవిడి శ్రీనివాస్.. 9966550601

నీ జ్ఞాపకంగా రాలుతూ...

ఆదివారం

ఆదివారం

నీ జ్ఞాపకంగా రాలుతూ...

నీ జ్ఞాపకాల్ని మోస్తూ
నీతో కలిసి తిరిగిన
ఈ ఇసుక తీరాల వెంట పొడిపొడిగా రాలిపోతున్నాను
ఈ ఇసుకలో ఈతచెట్లు ననే్న ప్రశ్నిస్తున్నాయి
నీ వెంట వెనె్నలలా నడిచే తోడేదనీ..
నీవు ఇక రాబోవు
నేను నీ జ్ఞాపకాల నుండి పోలేను.
ఆకాశం ఒడ్డున రాలిన నక్షత్రాలన్నీ నీవే
ఏరుకోడానికే యుగాలు చాలవు
మైదానాల వెంట మబ్బుల వెంట
అడవి దారుల వెంట తిరిగినా
రాలిపోయినవి తిరిగి బతికిరావు
సమకూర్చుకోడానికే
సమయాలు కలిసి లేవు
గాలి ఎప్పటిలానే రెక్కలు కట్టుకు
ఊగుతోంది
ఎండిన ఆకుల్లో నిండిన అనుభవాలు
వాలుతున్నాయి
దిగులుగా ఆకాశం గుంకుతోంది
మబ్బులేమో చీకటి తెరల్ని కప్పుతున్నాయి
కన్నీటి నదుల వెంట కాలం జారిపోతుంటే
ఆ ఒడ్డున
నీ అనేక జ్ఞాపకాలుగా రాలుతూ
మిగిలిన ఒంటరి చెట్టుగా నేను.
-గవిడి శ్రీనివాస్.. 9966550601

http://www.andhrabhoomi.net/weekly_special/aadivaram/content/234343


చినుకు పడితే చాలు..!

చినుకు పడితే చాలు..!

  •  60 Views
  •  
  •  0Likes
  • Like
  •  
  • Article Share

    చలపాక ప్రకాష్‌

  •  ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం
  •  విజయవాడ.
  •  924747597
చలపాక ప్రకాష్‌
జూన్, 2017
  •  
  •  

‘నీరు ఉంటేనే పల్లె.. నారి ఉంటేనే ఇల్లు’ అని ఓ సామెత! కానీ, పల్లెలిప్పుడు నీటిచుక్కల కోసం పదులకొద్దీ మైళ్లు పరిగెడుతున్నాయి. పట్నాలదీ దాదాపు ఇదే దుస్థితి. వాతావరణంలో మార్పులో, మానవ తప్పిదాలో... కారణమేదైనా రాన్రానూ మంచినీటికి కరవొచ్చిపడుతోంది. దప్పిక తీరక దేశం అల్లాడిపోతోంది. ఇలా పిడచకట్టుకుపోతున్న సామాన్యుల గళాలను ఎప్పటికప్పుడు తమ కవితల్లో వినిపిస్తూ వస్తున్నారు మన కవులు. ముఖ్యంగా నిరుడైతే నీరే కీలక కవితావస్తువైంది! సస్యశ్యామల సమాజాన్ని స్వప్నించే అక్షరహాలికుల ఆశానిరాశల కన్నీటిధారగా మారి ప్రవహించింది.
‘‘తనను తాను బద్దలు కొట్టుకుంటూ/ ఎండ కనపడని లావాలను గుమ్మరిస్తే/ నెర్రెలిస్తూ పగుళ్లు బారి భూగోళం/ కణకణమండే గాడిపొయ్యవుతుంది’’ అంటూ డా।। పి.బి.డి.వి.ప్రసాద్‌ చెప్పినట్టుంది ఈనాటి భూగోళం పరిస్థితి. రుతువులు మారుతున్నా వాతావరణంలో ఏ మార్పూ కనపడటంలేదు. ఏడాదిలో నాలుగు కాలాల్లోనూ ఎండలు మండుతున్నాయి!! ఆవిరయ్యే నీళ్లే తప్ప తిరిగి వాన రూపంలో నేలకు దిగే నీటిచుక్కలు అరుదైపోతున్నాయి. అందుకేనేమో 2016లో వివిధ పత్రికల్లో వచ్చిన కవితలను పరిశీలిస్తే... వాన- నీరు మీద కంటే మరే అంశంపైనా పెద్దగా కవిత్వం పారలేదు.
      ఇంటికి వచ్చిన ఎలాంటి వ్యక్తికైనా ముందుగా మంచినీళ్లు ఇచ్చి కుశలప్రశ్నలు అడిగేవారు నాడు! మరి ఈనాడు? మంచినీళ్లని ప్యాకెట్లలోను, బాటిళ్లలోను కొనుక్కు తాగే పరిస్థితి దాపురించింది. కుంటల దగ్గరి నుంచి నదుల వరకూ అన్నీ ఆక్రమణల పాలవుతుండటంతో నీటి గలగలలు వినిపించట్లేదు. దీనికితోడు పెరుగుతున్న కాలుష్యంతో అంతకంతకూ వేడెక్కిపోతున్న భూమి, వానలకు ముఖం వాచిపోతోంది. ఈ పరిస్థితిని చూసి చలించిన కవి హృదయాలెన్నో! ‘‘ఊళ్లన్నీ చెరువులను చప్పరించేసి/ కదలలేని వాగుల చేతులను కూడదీసుకొని/ ఆకాశంలో కనపడని మబ్బులకు/ దణ్ణాలు పెడుతుంటాయ్‌’’ అంటూ ‘వేసవి’ స్థితిగతులను, అది అలా మండిపోవడానికి గల కారణాలనూ, వాటి పర్యవసానాలనూ ఒక్కముక్కలో చెప్పేశారు ప్రసాద్‌. ‘‘...ఇంటెన్సివ్‌ కేర్‌లో/ వడదెబ్బకు విలవిల్లాడే దేశాన్ని చూస్తూ/ ఈ సీజన్‌ గడిస్తే గాని చెప్పలేమంటూ/ ఆందోళనతో చేతులెత్తేస్తోందీ ప్రజాస్వామ్యం’’ అన్నదీ కవిమాటే! ‘‘ఏం మిగిలింది ఈ ప్రపంచాన? బీడు పడిన పొలాలు చినుకు కురవని ఆకాశం. తల్లీ అక్కడే వున్నావా! నీ ముందర మరణిస్తున్న మనుషుల్ని లెక్కిస్తూ...’’ అంటూ చినుకు కోసం ఆశగా ఆకాశం వంక చూస్తూ నేలకు ఒరిగిపోతున్న దేహాలను తన ‘ఆఖరి బొమ్మ’లో కళ్లకుకట్టారు అరసవిల్లి కృష్ణ. గడిచిన సంవత్సరం కంటే, ఈ ఏడు ఎండాకాలం నిజంగా ఇంతటి విషమ పరిస్థితికి దారితీసింది.  
నదులే లేకపోతే..!!
‘‘భగభగలాడే ఎండలో/ బస్సు దిగాను/... అమ్మా! మామిడి పళ్లు కావాలా/ అరటి పళ్లు తేవాలా/ తాటి ముంజెలు తేనా/ తేగలు తేనా/... అవేవీ వద్దుగానీ నాన్నా!/ తాగేందుకు/ ఒక మంచినీటి డబ్బా తెమ్మంది/ కట కట లాడుతూ’’ అంటూ ‘ఉభయ గోదార్ల గోడు’లో ఎండ్లూరి సుధాకర్‌ తమ ప్రాంత దుస్థితిని చెప్పారు. ఇదే ఎండల ధాటిని కె.ఆంజనేయకుమార్‌ అయితే కాస్త వ్యంగ్యంగా కవిత్వీకరించారు. ‘‘ఏదో కథలో అప్పటి రాజుగారు/ తమ ఇంట్లో పెళ్లికి/ ప్రజలందరినీ.../ తలో గిన్నెడు పాలు తెమ్మని/ కఠినంగా ఆదేశించారు కానీ/ ఇదే ఎండలో అయితే/ ఇప్పటి రాజుగారు/ తమ ఇంట్లో పెళ్లికి/ ప్రజలందరినీ కనీసం గ్లాసుడు మంచినీళ్లు తెమ్మని/ కఠినంగా బతిమాలుకునేవారు’’ అని అంటారాయన తన ‘ఎండాకాలం’ కవితలో! 
      ఒకప్పుడు రోహిణి కార్తెలోనే రోళ్లు పగిలేవి. కానీ, ఇప్పుడు కార్తెలన్నీ కూడదీసుకుని భానుడి భజన చేస్తున్నాయి. దీనికి కారణమేంటో తన ‘నీటిఊట’లో చెప్పారు ఎనుగంటి అంజలి. ‘‘అంతరంగానికి ముసుగేస్తే/ ముఖాన చిర్నవ్వు పువ్వు/ పూస్తుందేమో గానీ-/ గుండెని ఛిద్రం చేస్తూ/ నేల తల్లికి కాంక్రీటద్దుతుంటే/ నీటి ఊటలెక్కడ మొలుస్తాయ్‌?’’ అని ఆవేదన చెందుతారావిడ. ‘జలవస్త్రాన్ని నిండుగా కప్పుకున్న భూగోళానికి/ జలసౌందర్యాన్ని వివరించాల్సిన అవసరమెందుకు’ అని ‘సముద్ర ముద్ర’లో ప్రశ్నించిన డా।। సి.భవానీదేవి- ఇంగ్లండులోని డార్ట్ముర్‌ నదిని చూసి ‘‘ఈ నది నిర్మలత్వాన్ని చూస్తున్నప్పుడు/ నా దేశంలో నదుల అనారోగ్యం గుర్తొచ్చింది/ ఈ నీరందిస్తున్న స్ఫూర్తినీ/ ఓదార్పునీ నా నదుల కోసం/ నాతోనే వెంట తెస్తున్నాను’’ అంటారు. ప్రజల నిర్లక్ష్యం, పాలకుల నిర్లిప్తతతో కాలుష్య కాసారాలుగా మారుతున్న మన నదుల దుస్థితికి ఈ కవిత అద్దంపడుతుంది. అలాగే, తన ‘దారులు వేద్దాం’లో కెక్యూబ్‌ వర్మ కూడా ‘‘ఒక్కో నదినీ ముక్కలు చేస్తూ ఎక్కడికక్కడ/ గోడలు కడుతున్నాడు వాడు’’ అంటూ మనిషి స్వార్థానికి బలైపోతున్న నదీమతల్లులను తలచుకున్నారు. నాగరికతలకు నడకలు నేర్పింది నదులే. అవే ఒట్టిపోయిన నాడు ఎంతటి డబ్బూ (దీనికోసమేగా ఆ స్వార్థశక్తులు ప్రకృతితో చెలగాటమాడుతున్నాయి!) మనిషిని కాపాడలేదు. ఇది నిజం!!
అదో రకం వాన!
మేఘాల మనసు కరిగి కాసిన్ని  నీళ్లను గుమ్మరించిన సందర్భాలూ లేకపోలేదు పోయినేడాది. అలాంటి ఓ వాన రాకడను కాస్త చమత్కారంగా చిత్రించారు ఎ.వి.రెడ్డి శాస్త్రి తన ‘మేఘ విలాపం’లో. ‘‘ఎక్కడ పడితే అక్కడ బైఠాయించడానికి/ ఇదేం నీ బాబుగారి జాగీరా? లే/ లేచి కిందికి పోతావా లేదా? అంటూ/ మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేంత/ పిడుగుల గొంతుకలతో అరిచాడు కదా.../ ఆ కిరాతకుడితో తలపడే శక్తి నాకెక్కడిదీ?/ చేసేదేముందిక? కన్నీరు మున్నీరుగా విలపిస్తూ/ కిందికి దిగిపోక తప్పలేదు - సర్లే, ఈ భూమ్మీదే పడుకుంటాన్లే అని సణుక్కుంటూ దిగి వచ్చాను’’ అని అంటారాయన. అలాగే, ‘‘గడ్డి పరకలకి/ ముత్యాలు కాసినయ్‌/ రాత్రి కురిసిన వాన’ అంటూ పి.వి.రామారావు అద్భుత ‘వాన’ రాకను అల్పాక్షరాల్లో పట్టిస్తే, వెంకటేష్‌ పైడికొండల ‘వచ్చి వెళ్లిపోయాక/ కాస్త తడి కూడా కనబడలేదు’ అంటూ ‘నేల తడవని వాన’ని నిష్ఠూరంగా నిలదీశారు. పడనా? వద్దా? అన్నట్టు తడబడుతూ పడే వానకు వృద్ధాప్యంతో సామ్యం చెప్పిన విహారి సృజన కూడా మనసును సున్నితంగా మెలిపెడుతుంది. ‘‘వానకి వయసు మళ్లింది, ఓపిక తగ్గింది/ ముసలి నసలా చినుకుల్ని రాలుస్తోంది’’ అన్నది ఆ కవి భావన!! ఇక ‘ఎండాకాలం వాన’ను వర్ణించిన శిఖా-ఆకాశ్‌ మాత్రం ‘‘ఎండకు భయపడని/ కూలీలంతా/ తమ చెమటని/ వానలో కడుగుకుంటున్నారు’’ అంటూ తనదైన భావచిత్రంతో కష్టజీవులకు కైమోడ్పులర్పించారు. 
      ఇవన్నీ ఒక ఎత్తయితే, చిత్తలూరి కలం ఇదే వానకు సంబంధించిన మరో కోణాన్ని ప్రతిభావంతంగా పట్టుకుంది. కుంభవృష్టి ధాటికి చిన్నాభిన్నమైన చెన్నై నగరాన్ని తలచుకుంటూ ‘ఈ నగరానికేమైంది’ కవిత రాశారు. ‘‘తమ స్థావరాలను ఆక్రమించిన/ అపార్ట్‌మెంట్లను చూసి/ వర్షమొచ్చినపుడల్లా/ నీటి పాము ఇంట్లోనే బుసకొడుతూ/ రద్దీ జీవనాన్ని కాటేస్తోంది’’ అంటూ పచ్చి నిజాన్ని సూటిగా చెప్పారు. ‘చెన్నైలో వాన’ పేరిట డా।। ఎన్‌.గోపీ కూడా ఆ సమయంలో  నగరవాసులు పడిన కష్టాల్ని ఆర్ద్రంగా చిత్రీకరించారు. 
వచ్చె వచ్చె వానజల్లు..
అతివృష్టి లేకపోతే వానచినుకులెప్పుడూ కవిసమయాలే! ‘‘అనాది నించీ ఆమె చినుకు/ అతను అనంతమైన దాహం’’ అంటూ ‘ద్వ్యర్థికావ్యం’లో కాశీభట్ల వేణుగోపాల్‌.. ‘చినుకు- దాహం’ల అవినాభావ సంబంధాన్ని, ప్రకృతిలోని ‘ఆమె- అతడు’లతో పోల్చి చెప్పారు. ఆ చినుకుల సవ్వళ్లను తన ‘అవును! విత్తనమూ ఒక తల్లే..!’ కవితలో అందంగా వర్ణించారు డా।। కత్తి పద్మారావు. ‘‘చినుకు చినుకులో ఓ కొత్త సృజన/ చినుకు చినుకులో ఓ కొత్త దృశ్యం/ చినుకు చినుకుకూ ఓ కొత్త ధ్వని/ ఆకుపై పడ్డప్పుడొక సడి/ మోడుపై పడ్డప్పుడు ఒక సవ్వడి’’ అంటూ, వాటికి చెవొగ్గమంటారు. ఇక రాపాక సన్నివిజయకృష్ణ అయితే ‘‘ఈ చినుకు వయ్యారికి/ నడుమెక్కడో’’ అంటూ ఆశ్చర్యపోయారు. వీళ్లకి కాస్త భిన్నంగా ‘‘జల జల ఆ నీళ్ళ రువ్వడి సూస్తే/ నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి/ గల గల ఆ నీళ్ల సవ్వడి వింటే/ చెవులు భూపాల రాగమై పరవశించినాయి/... అంటూ ప్రాకృతిక సౌందర్య వీక్షణాలను/ ఎన్ని సెల్‌ఫోన్‌ కెమెరాల కన్నుల నింపినా/ తనివి తీరదు. దృశ్యం వలగదు’’ అంటూ ‘బోగత జలపాతం’ సౌందర్యాన్ని కీర్తించారు అన్నవరం దేవేందర్‌. 
      ఏదిఏమైనా వర్షం కోసం, నీటి చెమ్మల కోసం కవులు పడే ఆరాటం అంతా ఇంతా కాదు! నీటి చుక్కల్ని తమ కవితా స్పర్శతో తనివితీరా తడిమి తడిమి వదిలితే కానీ, వారికి ఆనందముండదు!! కాబట్టే, ఎంత రాసినా ఇంకా ఏదో రాయాలనే తపన కవుల గుండెల్లో నిత్య ప్రవాహంలా పరుగులు పెడుతూనే ఉంటుంది. ‘‘నిన్న రాత్రి కురిసిన వాన/ ఇన్ని యుగాలు గడిచినా ఆదిమ అనాది గానంలానే/ సాగుతుంది’’ అని ‘నిన్న రాత్రి కురిసిన వాన’లో బాలసుధాకరమౌళి అభివర్ణించినా... ‘‘మేఘాలు కరుణించి వర్షిస్తే చాలు/ రైతుకు వ్యవసాయం వ్యవస్థితమే/ సమస్త ప్రాణికోటికి జీవామృతమే’’ అని ‘ఆకాశంలో ప్రకృతి చిత్రాలు’లో పనుల వెంకటరెడ్డి వేడుకున్నా... ‘‘చినుకు కురిస్తే చాలు/ చిగురించే చెట్టునవుతాను/ పరవశించే నెమలినవుతాను/ ఆకాశానికి వేలాడే/ ఇంద్రధనుస్సునవుతాను/ మనిషి నవుతాను/ మట్టిని నమ్ముకున్న/ రైతు బిడ్డనవుతాను/ మట్టిని మోసే మనిషిని/ మనిషిని నడిపే మట్టినీ అవుతాను’’ అంటూ ‘చినుకు సంబరం’లో గవిడి శ్రీనివాస్‌ సంబరపడ్డా... ఆ కవితల్లో కనిపించేది వానమీద ఆ అక్షరహాలికుల ప్రేమే! అవును మరి... కవి గుండెల్లో అనుభూతులు పారాలంటే, అవి అక్షరాలుగా మారి కాగితంమీద ప్రవహించాలంటే వర్షానికి మించిన ప్రేరణ ఏముంటుంది! అయితే, ఆ వాన సకాలంలో సరిపడినంతగా నేలను పలకరించాలంటే మనం కాస్త మారాలి. ‘‘చెట్ల ఊపిరి - ఆకుపచ్చని నది/ వెన్నెల రెమ్మ - పక్షుల రెక్కలు/ జీవన దీపం వెలుగుతూనే ఉండాలి/ మానవీయ వర్షం కురుస్తూనే ఉండాలి’’ అన్న దాట్ల దేవదానంరాజు ఆకాంక్ష అందరి కాంక్ష అయ్యి- ధరిత్రికి  ప్రేమతో ప్రణమిల్లాలి. భవిష్యత్‌ తరాలకి కన్నీటి చెమ్మని కాక మంచి నీటిచుక్కని కానుకగా అందించాలనే లక్ష్యానికి ప్రతినబూనాలి.

Tadisina batukulu

 

                                        04-AUG-2019 Visaalandra Sunday book 

Saturday 8 June 2019

రెక్కలూపే ధరలు

                                                        Eenadu /vipula monthly 2019


Saturday 25 May 2019

జీవనది


Vaartha sunday daily 19-05-2019

జీవనది - గవిడి శ్రీనివాస్  9966550601 ,7019278368   

ఒక ప్రవాహానికి కదులుతున్న. ప్రతిబింబం లా నేను
తడి చూపుల్ని ఆరేసుకున్న చెట్టు లా ఈ ఒడ్డున
ఏకాంతర అంతరంగ మధనంలో విరిగిపడే ఒక నేను.

జీవన గమనానికీ ఆంతరంగిక ఆలోచనకీ
ప్రవాహిని ఈ జీవనది
నీటిలా పారే మనసు కి
విశ్వాస బలం తో అంతఃకరణ శుద్ధితో
కర్మ లు శుద్ధి గావించబడతాయి.

భౌతిక భవ బంధనాలు చుట్టుకుంటూ
భోగ విలాసాలు రెక్కలు చాచుకుంటూ
మనిషి ని నిశ్చలంగా  ఉండనీయవు..

ధ్వజమెత్తిన కాంక్షా స్ధాయిలు
సనాతన ధర్మాలని సైతం 
వినాశం వేస్తాయి..

తులనాత్మక పరిశీలన లో
లౌకిక వైభవములే జీవిత
పరమార్థాలు గా కనిపిస్తాయి..

ఆధ్యాత్మిక సంపూర్ణ. ప్రపంచంలో
రక్షింపబడేవి ధర్మపక్షాన ఉంటాయి.

ఇప్పటి ఆలోచనలు నాలో ప్రవాహ వేగమై
ఇలా ఈ నది ని నాలో నింపుకోవడం
అలలు అలలు గా తేలిపోవడం
గులక రాళ్ళ శబ్ద సంగీతం లో మునిగిపోవటం
జీవిత సాన్నిహిత్యాన్ని సన్నిహితంగా చూడటం
నిర్మలంగా పరిపూర్ణంగా
ఆలోచన వాకిళ్ళను చూడటం  నాకిష్టం..

ఆకాసంలో రెక్కలు మొలిచినట్టు
జీవనది ని ఎత్తుకు పోయినట్లు
నాడుల్లో నీటి ప్రవాహాలు జీవ నదులవుతున్నాయి
జీవ నదులు జీవిత మవుతున్నాయి.. 

Tuesday 14 May 2019

గూటికి చేరే ముందు

గూటికి చేరే ముందు

ఇన్ని రోజులు గడిచాక 
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ 
ఒంటరి ఇల్లును వదిలి 
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా 
మనసు నిలకడా లేదు 

చుట్టూ చూస్తున్నాను
ఆదరించే ప్రపంచం నెలకొని ఉంది 
ఒకచోట ఉండాలనే ఉంటుంది 
వీచే గాలులు ఉరిమే ఉరుములు 
ఏవీ నాలో నన్ను అట్టే ఉండనీయవు 

ఏదో ముందుకు లాగినట్లు 
గెలుపేదో ఒక మార్గం నిర్ధేశిస్తున్నట్లు 
కాలాల్ని ఆనుకొని స్థలాలు మారతాం

నా వాకిలి రోడ్డును చూస్తూ 
నా పెరటి చెట్టును ఆస్వాదిస్తూ 
కాసిన్ని అడుగుల్ని ముందుకు నడిపాను
నాలాగే దూరం వచ్చి 
సొంతూరు పోవాల్సినవారు కలిశారు 
జీవితమూ మనసూ మారలేదు
కాస్త ఆర్థిక ప్రమాణాలు తప్ప!

ఇపుడొకటనిపిస్తుంది
ఉదయం ఎగిరిన పిట్టలు చెట్టునొదిలి ఉండలేవు 
మళ్ళీ గూటికి 
అలసి సాయంకాలం వాలింది!

- గవిడి శ్రీనివాస్‌
99665 50601

Saturday 4 May 2019

శ్రామిక తరంగాలు

http://epaper.prajasakti.com/2139030/MAIN-NEWS/MAIN-NEWS#page/11/3

http://www.prajasakti.com/Article/Jeevana/2136320

04-May-2019

శ్రామిక  తరంగాలు   - గవిడి శ్రీనివాస్  9966550601 ,7019278368   

మనిషొక  జీవన యంత్రం  మలుపొక జీవన తంత్రం 
పుడమి పుటల్లో శ్రామిక భాషలో  కార్మిక క్షోభ పర్వం లో 
నెత్తుటి అక్షరాలు కార్మిక గోడు గా గోడల పై నిలుస్తాయి .

చీకట్లను చింపి యంత్రాలతో  మగ్గిన లోకం ఇది.

మాటలు పెగలాలంటే బతుకుని నడపాలంటే 
యంత్ర   భాష మాటాడాల్సిందే ఇంద్రజాలం లా .

సమతూకం లేని  జీవితాల పైన  వేళ్ళాడుతూ 
ఇంటిదీపం మసకగా వెలుగుతుంది .

ఇనుప యంత్రాల వేడికి మరుగుతూ కొందరు 
కంప్యూటర్ ప్రపంచాన్ని నెత్తిన మోస్తూ కొందరు 
రాక్షస బల్లుల్లా చేతుల్ని నమిలే యంత్రాల మధ్య 
నల్ల కలువల్లా మండిపోతూ కొందరు 
పురికొసల యంత్రాల మధ్య పీలికవవుతూ కొందరు 
పాదరసం లా మారుతున్న జీవితాలు 
సంక్షేమ ఫలాలు నోచుకోని  బతుకుల్లో 
కాలాన్ని సంకెళ్లతో  ముందుకు నడుపుతున్నారు .

శ్రామిక జీవితాలు ఉషోదయం లేని 
మౌన ఘోషా కెరటాలుగా  మిగిలి పోతున్నాయి .

నిట్టూర్పుల మధ్య మింగుపడని ప్రశ్నల మధ్య 
సమాధానం దొరకని వ్యవస్థ మధ్య 
కార్మిక ఘోషలు వినిపించడం లేదు 

అయినా శ్రామిక  అంతరంగాలు భరోసా జీవిక కై 
ఆశ గా  వేలాడుతున్నాయి .