Saturday 23 March 2019

vennela mutyalu


చినుకు చిటపటల్లో
కొత్తరాగాలు ధ్వనిస్తున్నాయి
ఆస్వాదించాలే గానీ
తడవడం ఒక సుందర దృశ్యం
తేనె ధారలు కురుస్తున్నట్లు
చిరుదరహాసం మీద
కురుల సోయగాలు విరబూస్తున్నట్లు
మెలికలు తిరిగిపోతున్న వర్షం
చెట్లు తలాడిస్తూ
ఇంధ్రధనస్సుల్ని వెదుకుతున్నాయి
కళ్ళల్లో మెరుపులు
లేత యవ్వనాల తీగల్ని శృతి చేస్తున్నాయి
ఇక ఈ వానతో లోలోన జ్ఞాపకాల
జల్లులూ కురుస్తున్నాయి
చినుకు చిగురించాక
కన్నుల్లో వర్షం దృశ్యంగా కదిలాక
మనసు మొలకెత్తకుండా ఉండనూ లేదు.

https://www.yourquote.in/yourquote-kavi-buon/quotes/vennel-mutyaalu-snnsnngaa-jaaluvaarutuu-reppl-miid-vaalindi-ngale

https://www.yourquote.in/yourquote-kavi-buon/quotes/vennel-mutyaalu-snnsnngaa-jaaluvaarutuu-reppl-miid-vaalindi-ngale

Sunday 17 March 2019

సమస్యల కొలిమి


http://visalaandhra.com/wp-content/uploads/2019/03/Sundaybook17032019.pdf

17-3-2019  visalaandhra sunday book

Sunday 3 March 2019

ఒత్తిడి ఉక్కపోత


వర్తమాన సమాజ దృశ్యం మొత్తం 'ఒత్తిడి ఉక్కపోత' కవితలో గవిడి శ్రీనివాస్‌ చిత్రీకరించాడు.

http://epaper.prajasakti.com/2053524/MAIN-NEWS/MAIN-NEWS#page/4/2

ఒత్తిడి ఉక్కపోత

వర్తమాన సమాజ దృశ్యం మొత్తం 'ఒత్తిడి ఉక్కపోత' కవితలో గవిడి శ్రీనివాస్‌ చిత్రీకరించాడు.

ప్రపంచీకరణపై నిరసన కెరటాలు

                   సాహిత్యంలో ఇతర ప్రక్రియల కన్నా కవిత్వంలో తక్షణం స్పందించే గుణం ఉంటుంది. కొద్ది అక్షరాల్లో లోతైన ఆలోచనను, అవగాహనను అందించే లక్షణం కవిత్వంలో ఉంటుంది. సామాజిక దృష్టితో రాసిన కవితలు సూటిగా, శక్తివంతంగా ఉండి పాఠకుడిని కదిలిస్తాయి. అటువంటి కవితల సమాహారమే 'కవితా కెరటాలు' సంకలనం. రెండు దశాబ్దాల ప్రపంచీకరణ ప్రభావాన్ని అత్యంత వాస్తవికంగా ఈ సంకలనంలోని కవితలు చిత్రించాయి. వైజాగ్‌ ఫెస్ట్‌ 2017 ఆహ్వాన సంఘం నిర్వహించిన కవితల పోటీకి వచ్చిన వాటిలో నుంచి ఎంపిక చేసిన కవితలతో ఈ సంకలనం వెలువడింది. నాలుగు వందలకు పైగా వచ్చిన కవితల్లో నుంచి 76 కవితలతో చీకటి దివాకర్‌, ఎవి రమణారావు, నూనెల శ్రీనివాసరావు, పాయల మురళీకృష్ణ ఈ సంకలనం రూపొందించారు. 
ఈ సంకలనంలోని మొదటి మూడూ బహుమతి పొందిన కవితలు. మొదటి బహుమతి పొందిన సిరికి స్వామినాయుడు రాసిన 'జనంలోంచి..' కవిత వర్తమాన సమాజ చిత్రాన్ని కళ్లముందు ఉంచుతుంది. 'పడమటి కొండమీద/ వెలుగు మేకను మింగేస్తున్న చీకటి చిలువలా - దళారీ/ శ్రమశక్తినీ సహజ సంపదనీ మింగేస్తూ-/ సర్వవ్యాప్తమైనప్పుడు ఎవరితో యుద్ధం చేస్తావు?/ వ్యవస్థీకృతమై.. శత్రువు/ ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ.../ మబ్బుల మాటునుంచి శరసంధానం చేస్తున్నప్పుడు/ ఎలా యుద్ధం చేస్తావు?' అంటాడు. కవిత మొత్తం ప్రపంచీకరణ విధానాల సారాంశాన్ని చెప్తూనే మనం ఏం చెయ్యాలో కూడా మార్గదర్శనం చేస్తుంది. పది శాతం కుబేరులకు వ్యతిరేకంగా తొంభైశాతం పేద, మధ్య తరగతి ప్రజలంతా ఐక్యమై జట్టుకడితేనే శత్రువు ధ్వంసమవుతాడనే భావన కవిత వ్యక్తం చేస్తుంది. ఇటీవల భావప్రకటనా స్వేచ్ఛపై దాడులు జరగడం తెలిసిందే! ఆ వస్తువుతో కూడిన కవితకు ద్వితీయ బహుమతి పొందింది. గౌరీ లంకేశ్‌ హత్యను నిరసిస్తూ రాపాక సన్ని విజయకృష్ణ రాసిన కవిత పాఠకుడికి ఉద్రేకం కలిగించకుండా ఉండదు. ఒక్క గౌరీలంకేశ్‌ హత్యను నిరసిస్తూ రాసినట్లనిపించినా వరుసగా జరిగిన గోవింద పన్సారే, కల్బుర్గి, తదితర హత్యలన్నీ పాఠుకుడి దృష్టిపథంలోకి రాకుండా ఉండవు. ఎందరినని చంపుతారు అంటూ 'నేనూ గౌరీలంకేశ్‌నే' అన్న ప్రకటన రాజ్యాన్ని సూటిగా సవాల్‌ చేస్తుంది.'నువ్వు పారిపోతావంతే/ నేను మాట్లాడుతూనే వున్నాను/ నేను/ మరణాన్ని/ నువ్వు చేసిన హత్యలో చూడలేదు/ పిరికి పందవై/ నువ్వు/ పారిపోతున్నప్పటి/ నీ భయంలో చూసాను/ నీ చావుని చూసాను/ నువ్వలా శవంలా/ పరిగెత్తడం చూసాను/ పారిపోతూ పారిపోతూ/ నువ్వు హత్యను చేసాననుకుంటావు- మాట్లాడుతూనే ఉండటాన్ని/ హత్య చేయడం / నీకెప్పటికీ సాధ్యం కాదు' మాట్లాడుతూనే ఉండటాన్ని హత్య చేయలేవు అనడం రాజ్యాన్ని చాలెంజ్‌ చేయడమే! ఇలాంటి కవితలు చదివినపుడు కవి ఒక సామాజిక విమర్శకుడిగా కనపడతాడు. ప్రజా కంటకులను తన కవిత్వం ద్వారా నేరస్తులుగా నిరూపిస్తాడు. అడవిబిడ్డల జీవనాన్ని విధ్వంసం చేసింది ఈ ప్రపంచీకరణ. ప్రకృతి వనరుల మీద కన్నేసిన కార్పొరేట్లు ఎలాంటి దుర్మార్గాలకైనా వెనకాడని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యాన్ని వస్తువుగా సుదేరా రాసిన కవిత 'వనమాలి'. 'వంపులు తిరిగిన కోనడొంకకి పసిడి వడ్డాణమైన వలిసెపూల సోయగం/ వలసరైలు పట్టుకుంటుంది.. చన్నుకు వేలాడే శిశువుల్తో/ వెన్నుకు వేలాడే మూటల్తో!' ఈ కవితకు తృతీయ బహుమతి లభించింది. ఈ కవిత సొంత ఆవాసాల నుంచి దౌర్జన్యంగా నెట్టివేయబడిన గిరిజనుల జీవిత దృశ్యాన్ని వేదనాభరితంగా వ్యక్తం చేస్తూనే- గిరిజనుడి సహజ ప్రతిఘటనా స్వభావాన్ని మన కళ్ళ ముందుంచుతుంది. 
బహుమతి కవితలకు ఏమాత్రం తీసిపోకుండా మిగతా కవితలు పాఠకుడ్ని ఆకట్టుకుంటాయి. ర్యాలీ ప్రసాద్‌ తన 'అతడు సూర్యుడు' కవితలో- 'ఏ గుడిసెలో దీపం/ ఇంధనం లేక బతుకుతో పోరాడుతుందో/ ఆ ఇంట్లోంచే సూర్యుడుదయిస్తాడు' అంటాడు. ఎవరినైతే ఈ సమాజం నిర్లక్ష్యం చేస్తుందో, ఎవరినైతే ఈ సమాజం కష్టాలకు గురిచేస్తుందో, ఎవరినైతే ఈ సమాజం నిత్యావసరాలు కూడా అందకుండా చేస్తుందో... వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అని ఈ కవిత చదివిన తరువాత పాఠకుడికి తోచకుండా ఉండదు. స్వచ్ఛభారత్‌ ప్రచారం హోరెత్తిపోతున్న సందర్భంలో పుప్పాల శ్రీరాం కవిత 'ఏబిసిడిఎఫ్ఫూ ఓడిఎఫ్ఫూ' చదివి తీరాల్సిందే. 'స్త్రీలను గౌరవించడం/ మన సాంప్రదాయమన్న నినాదాలన్నీ/ ఊరవతల రైలు కట్ట మీద/ ఉమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాయి' అంటాడు. డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో బహిరంగ మల విసర్జన సమస్యను తీర్చలేకపోవడాన్ని ప్రశ్నిస్తుంది ఈ కవిత. అడవుల్ని కార్పొరేట్‌ కంపెనీలు కాజేయడాన్ని తన కవితా చరణాల్లో దృశ్యంగా మారుస్తాడు-'మనాది' కవితలో అనిల్‌ డ్యాని - ఎక్కడిది ఇంత పచ్చదనం/ మనుషుల్లోంచి అడివిలోకి పాకిందా/ అడివిలోంచి మనుషుల్లోకి పాకిందా/ ఏమో మరి ఒక ఊదురు గొట్టాన్ని పొయ్యి ముందేసుకుని/ పొగ లేవకుండా ఊపిరిని పొయ్యిలోకి నెట్టి/ కళ్ళ వెంబడి కారిన తల్లుల కన్నీళ్ళతో అలా పారుతున్న/ ఈ బంగాళాఖాతాన్ని అడగాలి/ ఎవడో ఏసీ గదుల్లో పడుకుని/ ఈ కనుమల మధ్యన ఒక వ్యాపారాత్మక కలకంటాడు/ ఇక్కడి చేపల్ని వేటాడి విదేశీ ఎండకు ఎండబెడతాడు/ ఇక్కడి మకరందాన్ని సీసాలో బంధించి/ తెల్ల తోలువాడికి కప్పులో కాఫీలా కలిపిస్తాడు/ ఏళ్ళ తరబడి గిరిజనుల కడుపు నింపుతున్న/ అడవితల్లి మౌనంగా దుఃఖించిన సందర్భం అది'. మనుషుల్లో మానవత్వం కనుమరుగయితే మానవ సంబంధాలు ఎంత దుర్భరంగా తయారవుతాయో తన 'మహాయాత్ర' కవితలో చొక్కర తాతారావు తీవ్రంగా చెప్పారు. మన రాజ్యాంగాన్ని హేళన చేస్తూ దేశంలో మత రాజకీయాలు చొచ్చుకు వచ్చిన తీరును తన 'దేశముఖచిత్రం' కవితలో ఇల్ల ప్రసన్నలక్ష్మి ఆక్షేపించారు. 'ఆత్మహత్యల సంతకం' కవితలో జి.వి. సాయిప్రసాద్‌ విద్యార్థుల ఆత్మహత్యల దృశ్యాన్ని కవిత్వం చేస్తూ ఆలోచింపచేస్తాడు. 
ప్రపంచీకరణ మార్కెట్‌ స్వభావాన్ని కవి డా|| బండి సత్యనారాయణ - 'మార్కెట్‌... మార్కెట్‌...మార్కెట్‌' శీర్షికన వాస్తవిక భావనను దృశ్యం చేశారు. 'ప్రపంచమంతా నిద్రపోయినా / మార్కెట్‌ నిన్ను నిద్రపోనివ్వదు/ కలలో కూడా నిన్ను కవ్విస్తూనే 
ఉంటుంది' అంటారు. ఇప్పుడు మాట్లాడుకోవటమంటే అనుబంధం పెంచుకోవటం కోసం కాదు. అవసరాల కోసం, అమ్మకాల కోసం, వ్యాపారం కోసం తప్ప ఇతరత్రా మాటలు ఉండవు. ఈ అంశాన్ని 'చిన్నమాట' కవితలో చాలా చక్కగా కవిత్వం చేశారు- శారద ఆవాల. మనిషి చనిపోయిన తర్వాత దహనం చేసే ప్రక్రియ కూడా ప్రపంచీకరణలో ఎలా మారిపోయిందో 'వేగంగా దహనం చెయ్యాలా?' అనే కవితలో కుప్పిలి వెంకట రాజారావు చెప్పిన తీరు విస్మయపరుస్తుంది. పొలాలు అమ్ముకునే పరిస్థితుల్ని ఒక పద్మవ్యూహం అంటూ 'దైన్యం' కవిత రాశారు- గార రంగనాధం. వర్తమాన సమాజ దృశ్యం మొత్తం 'ఒత్తిడి ఉక్కపోత' కవితలో గవిడి శ్రీనివాస్‌ చిత్రీకరించాడు. 
ఎంతటి విషమ పరిస్థితులు ఎదురైనా మనిషి ఎదుర్కొంటాడు. మనిషిలో సహజంగానే భావాలు పురివిప్పుకొంటాయి అంటూ 'సంగ(ఘ)మం' కవిత ద్వారా రెడ్డి శంకరరావు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. యువ కవయిత్రి జి.సృజన 'కొత్తబడి కావాలి' అంటూ రాసిన కవిత ఆలోచింపచేస్తుంది- 'ఇక్కడ భవనాలు ఇంత ఆధునికంగా ఉన్నాయి కానీ/ ఆలోచనలెందుకు ఇంత అనాగరికంగా ఉన్నాయి/ వైఫైలు, ఆన్‌లైన్లూ, సైబర్లు, హైటెక్కులూ/ విశ్వమంత విశాలంగా ఉన్నాయి కదా/ మన చేతలెందుకు ఇంతగా కుంచించుకు పోతున్నాయి' స్వచ్ఛమైన తాజా గొంతుతో వేసిన ఈ ప్రశ్నకు అందరమూ బాధ్యత వహించాల్సిందే. తర్వాత తరాలకు మనం ఎటువంటి సమాజాన్ని అందివ్వాలో తేల్చుకోవాల్సింది మనమే! 
జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అనేక వర్తమాన అంశాలను కవులు, కవయిత్రులు ఈ సంకలనంలో స్పృశించారు. కవితలన్నీ చాలా లోతైన భావాన్ని వ్యక్తపరిచాయి. ఆయా అంశాల పట్ల పాఠకులకు ఎంతో కొంత ఆలోచన రేకెత్తిస్తాయి. వాస్తవికమైన అవగాహనతో, సామాజిక దృష్టితో కూడిన ఇన్ని కవితలు ఒకేసారి చదవటం మంచి అనుభూతి. ప్రపంచీకరణ ఫలితాలు అనేక రూపాల్లో సమాజాన్ని ప్రభావితం చేసిన తీరుకి ఈ కవితలు అద్దం పట్టాయి. ప్రపంచీకరణ అసలు గుట్టును ప్రతి కవితా బట్టబయలు చేసింది. ఈ పుస్తకం ప్రజాశక్తి బుకహేౌస్‌లలో లభిస్తుంది. వెల 100 రూపాయలు. సముద్ర కెరటాలతో నీలిరంగుతో గిరిధర్‌ రూపొందించిన ముఖచిత్రం సంకలనానికి మరింత వన్నె తెచ్చింది.
- వొరప్రసాద్‌
9490099059