Saturday 25 May 2019

జీవనది


Vaartha sunday daily 19-05-2019

జీవనది - గవిడి శ్రీనివాస్  9966550601 ,7019278368   

ఒక ప్రవాహానికి కదులుతున్న. ప్రతిబింబం లా నేను
తడి చూపుల్ని ఆరేసుకున్న చెట్టు లా ఈ ఒడ్డున
ఏకాంతర అంతరంగ మధనంలో విరిగిపడే ఒక నేను.

జీవన గమనానికీ ఆంతరంగిక ఆలోచనకీ
ప్రవాహిని ఈ జీవనది
నీటిలా పారే మనసు కి
విశ్వాస బలం తో అంతఃకరణ శుద్ధితో
కర్మ లు శుద్ధి గావించబడతాయి.

భౌతిక భవ బంధనాలు చుట్టుకుంటూ
భోగ విలాసాలు రెక్కలు చాచుకుంటూ
మనిషి ని నిశ్చలంగా  ఉండనీయవు..

ధ్వజమెత్తిన కాంక్షా స్ధాయిలు
సనాతన ధర్మాలని సైతం 
వినాశం వేస్తాయి..

తులనాత్మక పరిశీలన లో
లౌకిక వైభవములే జీవిత
పరమార్థాలు గా కనిపిస్తాయి..

ఆధ్యాత్మిక సంపూర్ణ. ప్రపంచంలో
రక్షింపబడేవి ధర్మపక్షాన ఉంటాయి.

ఇప్పటి ఆలోచనలు నాలో ప్రవాహ వేగమై
ఇలా ఈ నది ని నాలో నింపుకోవడం
అలలు అలలు గా తేలిపోవడం
గులక రాళ్ళ శబ్ద సంగీతం లో మునిగిపోవటం
జీవిత సాన్నిహిత్యాన్ని సన్నిహితంగా చూడటం
నిర్మలంగా పరిపూర్ణంగా
ఆలోచన వాకిళ్ళను చూడటం  నాకిష్టం..

ఆకాసంలో రెక్కలు మొలిచినట్టు
జీవనది ని ఎత్తుకు పోయినట్లు
నాడుల్లో నీటి ప్రవాహాలు జీవ నదులవుతున్నాయి
జీవ నదులు జీవిత మవుతున్నాయి.. 

Tuesday 14 May 2019

గూటికి చేరే ముందు

గూటికి చేరే ముందు

ఇన్ని రోజులు గడిచాక 
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ 
ఒంటరి ఇల్లును వదిలి 
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా 
మనసు నిలకడా లేదు 

చుట్టూ చూస్తున్నాను
ఆదరించే ప్రపంచం నెలకొని ఉంది 
ఒకచోట ఉండాలనే ఉంటుంది 
వీచే గాలులు ఉరిమే ఉరుములు 
ఏవీ నాలో నన్ను అట్టే ఉండనీయవు 

ఏదో ముందుకు లాగినట్లు 
గెలుపేదో ఒక మార్గం నిర్ధేశిస్తున్నట్లు 
కాలాల్ని ఆనుకొని స్థలాలు మారతాం

నా వాకిలి రోడ్డును చూస్తూ 
నా పెరటి చెట్టును ఆస్వాదిస్తూ 
కాసిన్ని అడుగుల్ని ముందుకు నడిపాను
నాలాగే దూరం వచ్చి 
సొంతూరు పోవాల్సినవారు కలిశారు 
జీవితమూ మనసూ మారలేదు
కాస్త ఆర్థిక ప్రమాణాలు తప్ప!

ఇపుడొకటనిపిస్తుంది
ఉదయం ఎగిరిన పిట్టలు చెట్టునొదిలి ఉండలేవు 
మళ్ళీ గూటికి 
అలసి సాయంకాలం వాలింది!

- గవిడి శ్రీనివాస్‌
99665 50601

Saturday 4 May 2019

శ్రామిక తరంగాలు

http://epaper.prajasakti.com/2139030/MAIN-NEWS/MAIN-NEWS#page/11/3

http://www.prajasakti.com/Article/Jeevana/2136320

04-May-2019

శ్రామిక  తరంగాలు   - గవిడి శ్రీనివాస్  9966550601 ,7019278368   

మనిషొక  జీవన యంత్రం  మలుపొక జీవన తంత్రం 
పుడమి పుటల్లో శ్రామిక భాషలో  కార్మిక క్షోభ పర్వం లో 
నెత్తుటి అక్షరాలు కార్మిక గోడు గా గోడల పై నిలుస్తాయి .

చీకట్లను చింపి యంత్రాలతో  మగ్గిన లోకం ఇది.

మాటలు పెగలాలంటే బతుకుని నడపాలంటే 
యంత్ర   భాష మాటాడాల్సిందే ఇంద్రజాలం లా .

సమతూకం లేని  జీవితాల పైన  వేళ్ళాడుతూ 
ఇంటిదీపం మసకగా వెలుగుతుంది .

ఇనుప యంత్రాల వేడికి మరుగుతూ కొందరు 
కంప్యూటర్ ప్రపంచాన్ని నెత్తిన మోస్తూ కొందరు 
రాక్షస బల్లుల్లా చేతుల్ని నమిలే యంత్రాల మధ్య 
నల్ల కలువల్లా మండిపోతూ కొందరు 
పురికొసల యంత్రాల మధ్య పీలికవవుతూ కొందరు 
పాదరసం లా మారుతున్న జీవితాలు 
సంక్షేమ ఫలాలు నోచుకోని  బతుకుల్లో 
కాలాన్ని సంకెళ్లతో  ముందుకు నడుపుతున్నారు .

శ్రామిక జీవితాలు ఉషోదయం లేని 
మౌన ఘోషా కెరటాలుగా  మిగిలి పోతున్నాయి .

నిట్టూర్పుల మధ్య మింగుపడని ప్రశ్నల మధ్య 
సమాధానం దొరకని వ్యవస్థ మధ్య 
కార్మిక ఘోషలు వినిపించడం లేదు 

అయినా శ్రామిక  అంతరంగాలు భరోసా జీవిక కై 
ఆశ గా  వేలాడుతున్నాయి .

నీ జ్ఞాపకంగా రాలుతూ ..!

నీ జ్ఞాపకంగా రాలుతూ ..!   - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601

నీ జ్ఞాపకాల్ని మోస్తూ 
నీతో కలిసి తిరిగిన 
ఈ ఇసుక తీరాల వెంట పొడి పొడి గా రాలిపోతున్నాను .

ఈ ఇసుకలో  ఈతచెట్లు నన్నే ప్రశ్నిస్తున్నాయి 
నీ వెంట వెన్నెలలా  నడిచే తోడేదనీ ..

నీవు ఇక రాలేవు 
నేను నీ జ్ఞాపకాల నుండీ పోలేను .

ఆకాశం  ఒడ్డున రాలిన నక్షత్రాలన్నీ నీవే .
ఏరుకోడానికే  యుగాలు చాలవు .

మైదనాల వెంట  మబ్బులవెంట 
అడవి దారుల వెంట తిరిగినా
రాలిపోయినవి తిరిగి బతికిరావు .

సమకూర్చుకోడానికే 
సమయాలు కలిసి లేవు .

గాలి ఎప్పటిలానే రెక్కలు కట్టుకు ఊగుతోంది .
ఎండిన ఆకుల్లో నిండిన అనుభవాలు వాలుతున్నాయి.

దిగులు గా ఆకాశం గుంకుతోంది 
మబ్బులేమో చీకటి తెరల్ని  కప్పుతున్నాయి .

కన్నీటి నదుల వెంట కాలం జారిపోతుంటే 
ఆ ఒడ్డున 
నీ అనేక జ్ఞాపకాలు గా రాలుతూ 
మిగిలిన ఒంటరి చెట్టుగా నేను .


28-April-2019