Sunday, 17 June 2018

ఒంటరితనం ఒక వేదన


http://visalaandhra.com/wp-content/uploads/2018/06/Sundaybook17062018.pdf

ఒంటరితనం ఒక వేదన  -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601
వొళ్ళు విరుచుకుంటున్న
నాల్గు గోడల మధ్య
వేలాడుతున్న శూన్యాన్ని
ఒంటరిగా తెరిచిన కళ్ళతో చూశాను.
అలికిడిలేని ప్రపంచంలో
శూన్యపు పొరలు
దిగులు మేఘాలు గా కురవడం
సందేశమూ సమాధానం లేక
ఒంటరి జ్ఞాపకాల్లో తడవడం
చిరాకు దిండు మీద దొర్లడం
ఎంత దుర్లభం!
ఇప్పుడు ఎవరితో  మాటాడాలి
కాసింత వీచే గాలితో మాటాడాలి
తల ఊపే మొక్క తో మాటాడాలి
కాలాన్ని తిప్పే గాలి మర తో మాటాడాలి
మనిషి కి మనిషి తోడులేకుంటే 
ఇంకెవరి తో మాటాడాలి.
కొన్ని సందర్భాలు వెంటాడే ఒంటరితనాలు
కోల్పోతున్న బతుకు రుతువుల్ని
జీవితపు బంధాల విలువల్ని
ఒంటరి కి పాఠాలు వల్లివేస్తాయి
బిక్కు బిక్కుమంటున్న నాల్గు దిక్కుల్లో
వొలికిపోతున్న దుఃఖాన్ని
ఒక్కో జ్ఞాపకంగా కళ్ళలో తడుముకుంటూ
కాలం నిశ్శబ్ద ప్రవాహంలోకి రాలిపోతుంది!

Sunday, 3 June 2018

మరి! వస్తానూ

Praja Sakti today aksharam

http://epaper.prajasakti.com/c/28661531

మరి! వస్తానూ ..!! -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601

ఈ కళ్ళలోంచి విస్తారంగా నడచిన
చూపుల మేఘాలు
కాస్తంత దట్టంగా కాస్తంత బరువు గా
కోరుకుతున్న బాధ లా
నన్ను చుట్టుముడతాయి .

నీ వెళుతున్నావనీ
ఎత్తిన చేయి దించకుండా అలా ఊపడమే మొదలు
మనసుని సమాధాన పరచుకోలేక
కన్నీళ్లను రెప్పల సంద్రం లో దాచలేక
ఉబుకుతూ ఊగుతూ
వీస్తున్న తుపాను లోంచి జారే నదిలా
అలా నన్ను తడిపి పోతాయి .

జీవితాన్ని అనుభవాల తో కాగి
పెనవేసుకున్న బంధాలు గుండెను అలా లాగి
కాలం రెక్కల పై
కర్పూరం లా వెలిగి కరిగి పోవడం తప్పా
దేన్నీ ఆపలేని చిట్టి గుండె చివుక్కుమంటుంది .

ఎప్పుడు ప్రవేశించావ్
ఇప్పుడు కాస్తంత దూరంగా ఎందుకు ఎందుకు నిష్క్రమిస్తున్నావ్ .

దూరం కొలతలు తెలీవు గానీ
దూరం గాయాల్ని తడుతుంది .

నీతో భౌతిక ప్రపంచం వేరు
నీతో మాటాడిన క్షణాల రూపం వేరు

రెప్పల ముందు రెపరెపలాడుతూ
నా చేతి వేళ్ళ సందుల్లోంచి
నీవు దుఃఖం గా జారిపోతుంటే
ఉక్కబోత లో ఊపిరాడక
ఇంతితై జీవితం చీకటి తెరలు కప్పిపోతున్నట్లు
నేను ఒక నీ జ్ఞాపక దృశ్యం గా రాలిపోతాను .

'మరి వస్తానూ ' అన్న నీ మాట తో
మూగ బోయిన క్షణాల్ని ఆ దృశ్యాల్ని
కను గుడ్ల లో చెరిగి పోనీ చిత్రాలు గా బంధిస్తూ
భరోసా లేని బతుకు వైపు
నిర్లిప్తంగా కదులు తూ
కాలం కలుక్కుమంటుంది .




May 2018 Telugu vidyarthi mothly