http://epaper.prajasakti.com/c/31352272
06-Aug-2018
మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601
అలా
ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ
సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ
పొలం గట్ల మీద చూపులవెంట
నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న
మా ఊరి చెరువు.
మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే
ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే
ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే
గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి.
ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో
ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా
నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది.
నా పక్కనే తిరుగు ముఖంలో
ఆవులు ఎద్దులు మేకలు
నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు
మిశ్రమ సమూహాలికి కొదువేలేదు
అలా కాసేపు ఆకాసం వంక
ఎగిరే మబ్బుల గుర్రాల్ని
సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని
నాలో పూర్తిగా నింపేసుకున్నాను.
ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని
అనుభూతిని బంధించటం ఒక వరం.
వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో
మునిగితేలటం ఒక బతకటం.
నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా
మా ఊరి చెరువు.
వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది
ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది.
నేను చెరువు గట్టంట నడిస్తే చాలు
సంతోషాన్ని నిర్వచించలేని
అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ
ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని
వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.!
No comments:
Post a Comment