ఉన్నట్టుండి మబ్బులు
ఉరమటం మొదలెట్టాయి.
ఎండకు తడిసిన తనువులు
చినుకు సంబరంతో
మట్టి మధ్య మొలకెత్తుతున్నాయి.
నా గాలిలో మట్టి పరిమళం
నా శ్వాసలో ఆశను రేపింది.
చినుకు తడితో మట్టి పులకించినట్లు
మట్టిని తాకిన ఒళ్ళు జలదరించిపోతోంది.
పిడికెడు మట్టిని పట్టిన
దోసిళ్లలోకి రాలిన నా కన్నీళ్లు
ఆనందాశ్రువుల్ని పోగు చేస్తున్నాను.
గుప్పెడు గుండెలో
వెలుగు వరదల్ని నింపే
నీటిలో పులకరించిపోతున్నాను.
నాగలితో దున్నుకోడానికి
ఒక ఆకాశం వచ్చి వాలినందుకు
ఒక చినుకుగా మాట్లాడినందుకు
పూల వర్షంలా జారినందుకు
తనువు బహుముఖంగా పులకరిస్తోంది.
గాలిసయ్యాటలాడుతోంది
మనసు ఊగుతోంది
పల్లె పరవశంలో
మనసు మునుగుతోంది.
నా మట్టంటే
బహుమానమంత అభిమానం
కాలం మీద చెప్పుకున్న కబుర్లన్నీ
నా మట్టితో నిండిన అనుభవాలే.
చినుకు కురిస్తే చాలు
చిగురించే చెట్టునవుతాను
పరవశించే నెమలినౌతాను
ఆకాశానికి వేలాడే
ఇంద్ర ధనుస్సునవుతాను.
మనిషినవుతాను
మట్టిని నమ్ముకున్న
రైతు బిడ్డనవుతాను
మట్టిని మోసే మనిషిని
మనిషిని నడిపే మట్టినీ అవుతాను
గవిడి శ్రీనివాస్
- 08886174458
19-6-2016
http://www.prajasakti.com/SnehaBook/180659919-6-2016
http://www.prajasakti.com/WEBSUBCONT/1806599
No comments:
Post a Comment