Sunday, 10 July 2016

ఒక జీవితం

ఒక జీవితం

కొన్ని ఉరుములు
కొన్ని పిడుగులు
జీవితంలో ఉలిక్కి పడుతుంటారు!

సంతోష సాగరంలో ఈదుతున్నపుడు
తన్మయ క్షణాల్లో మునుగుతున్నపుడు
కోల్పోయిన బంధాలేవో
లోలోపల అలా తడుముతుంటారు!
మూలాల వెంట వదిలిపోయినవి
కళ్లెం పట్టుకు లాగుతుంటారు!

దూరమైన జీవితాల్లో
భౌతిక సమ్మేళనాలుండవ్‌
గాయపడ్డ మమతల దేహాలు తప్ప!

నాకిప్పటికిప్పుడు
నా వాళ్ళతో నా మట్టితో
కాసేపు మనసారా కురిసే
మాటలా జారిపోవాలనుంది

జీవితమంటే
నలుగురి ఆప్యాయతల కలయిక
మనసు ఊరటను
వ్యక్తపరిచే ఒక వేదిక
హ దయం రెక్కల రెపరెపల్లో
సందర్భాల్ని వెతుక్కుంటూ
కాలాన్ని మోసుకుపోతున్నాను

మనసారా నవ్వడానికి
ఆర్థిక కొలతలు అవసరం లేదు
అంతుచిక్కని లెక్కల్లోకి దిగితే
సమీపించే కొద్దీ సాధించేకొద్దీ
చేరాల్సినది వేరే ఉంటుంది

గమ్యాల చేరికలో ఒక జీవితం
సుగంధాల జల్లులు కురుస్తున్నట్లు
వేపచేదులు తినిపిస్తున్నట్లు
ఒక అనుభూతి అంతర్భాగమవుతోంది
ఆగని కాలం గుర్రపు స్వారీ చేస్తుంది
మనమే కన్నీళ్లను తీపిగా చేదుగా
అభివర్ణిస్తుంటాం
జీవితం అనేక అనుభూతుల, అనుభవాల విద్యాలయం!

- గవిడి శ్రీనివాస్‌
087227 84768

No comments:

Post a Comment