Thursday 12 July 2018

నెత్తురోడిన క్షణం

09-July -2018 prajasakti daily
నెత్తురోడిన క్షణం
Posted On: Sunday,July 8,2018
మొగ్గవీడని సూర్యోదయానికి గ్రహణం కమ్మినట్లు
చీకటి పులిమి నెత్తురోడినట్లు
వంచించే వాంఛలు పులులవుతుంటే
విచక్షణ క్షణకాలం కళ్ళు తెరవకుంటే
ఉదయాలన్నీ కాళరాత్రులవుతున్నాయి
సింధూరం పూసిన నుదిటిమీద
నెత్తుటి చారలు రగిలిపోతుంటే
ఎరుపెక్కిన దహన దాహ జ్వాలల్లో
జీవన గానమే ఎరుపవుతుంది
నడిచేదారుల్లో చిక్కుముడుల వలలు
చూపుల్ని అలికే సాలెగూడు తీగలు
మూసిన కళ్ళు తెరిచేలోపే
నరాలని నలిపి ఊపిరిని తెంపి తడబడుతుంటే
మూగబోయిన జీవన శల్యాలు
చుక్కలు మొలిసిన ఆకాశం కింద
దోషం చూసే చూపులదా
వేషం మార్చే క్రూర మనసులదా
ప్రాణశక్తిని తెంచే మనుషులదా
చీకట్లనే కలగనే ఆ ప్రపంచ తీతువులదా ...
కాలం ముక్కలవుతూనే ఉంది
పసిజీవాలు నెత్తుటి మరకలవుతున్నాయి
నెత్తురోడిన క్షణికం విచక్షణ తెరవని ద్వారం దగ్గర
రోదన విడువలేని తడినెత్తుటి జీవితాలు
అస్తమిస్తూనే ఉన్నాయి నిన్నా నేడూ...
భరోసాలేని రేపటి వైపు ఒక ప్రశ్న వాలింది
ఎప్పటిలానే ...!
- గవిడి శ్రీనివాస్‌
73380 53650


నేను పాఠం నేర్పాను ..!


Prajasakti 02-07-2017 daily


నేను  పాఠం నేర్పాను ..! -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601

నేను మాట నేర్పాను 
మౌనం బద్దలయింది .
నేను భరోసా ఇచ్చాను .
ఆశ  విత్తుగా   మొలకెత్తింది 
నేను పాఠం నేర్పాను 
చైతన్యం  ఉరకలేసింది 
నేను ఉదయించే సూర్యుని చూపాను 
పోరాటానికి పునాది పడింది 
నేను ప్రశ్నను చూపాను 
సమాధానమే ఎదురై నిలిచింది 
నేను అగ్నిని చూపాను 
క్షమించరానిదేదో  బూడిదయింది.
నేను కళ్ళు తెరవమన్నాను 
ఆత్మ స్థైర్యం  నిలుచుని పోరాడింది 
నేను మౌనంగా నవ్వుకున్నాను 
స్థబ్దంగా పడిన క్షణాల నైరాశ్యాన్ని చూసీ ..!