Sunday 5 July 2015

ఆ దేహం నాదే

రచన: గవిడి శ్రీనివాస్
మల్లెపూలు పెట్టుకుని
వెన్నెల చీర చుట్టుకుని
నా హృదయ ద్వారం ముందు నిలబడ్డ
సిగ్గుతో నేసిన ఓ ముగ్గు బుట్టా
ఎన్ని రంగుల ముగ్గులా వుందో !
కాటుక చెక్కిన కళ్ళ అందాలతో
జారే జలపాతంలాంటి
ఊయలలూగే నడుంతో
ముట్టుకుంటే తేనే స్వరాలు
వొలికే వేళ్ళతో
కురులతో అలా పిలుస్తున్నట్టుగా
సమ్మోహనంగా కవ్విస్తున్నట్టుగా
లోలోన మనసు పరదాల వెనుక
ఆశలు కొద్ది కొద్దిగా చిగిరిస్తున్నట్టుగా
ఆమె దేహం గాలి తరంగాల్లో
సందేశాల సవ్వడి చేస్తోంది
నా ముందు నిలిచి
చూపుల పూల దండలతో గుచ్చీ
మనసు అంగీకారాన్ని
దేహ భాషగా పరిచాక
ఒక ఆరాధనా భావంతో
నీ హృదయ సామ్రాజ్యాన్ని
జయించినందుకు
నాదైన భాషలో భావంలో
నీ కోసం వెన్నెల సామ్రాజ్యాన్ని నిర్మించా!
అనుభూతుల పల్లకిలో
ఆత్మానందంతో తేలియాడుతూ
స్నేహపరిమళాన్ని పూసుకుని
ఏడు అడుగులుగా నడవడానికి సిద్ధపడ్డ
నాకే సొంతమైన
ఆ అంతరంగాల ప్రేమపందిరి
ఆ దేహం నాదే !
నా కోసం పుట్టిందే !!



web magazine  maalika  01-07-2015  published

No comments:

Post a Comment