Sunday 9 August 2015


కనురెప్పల భాష
-గవిడి శ్రీనివాస్
9966550601 ,08722784768
నీ కనురెప్పలపై ఊయలూగి
నుదుటిన వెలిగే
చంద్రబింబాన్ని అందుకోవాలని ఉంది!
నీ కనురెప్పలు
మూస్తూ తెరుస్తుంటే
నెమలి పింఛంతో
గాలి విసురుతున్నట్లుంది
అలా వాల్చిన
నీ కనురెప్పల తలుపులు
ప్రశాంత ప్రపంచాన్ని
మేల్కొలుపుతున్నాయి
రెప్పలు వాల్చిన
నీ మౌన ప్రపంచంలో
తడిసి ముద్దయిన వాడ్ని.
నీవు కనురెప్పల్ని తెరచి చూస్తే
మేఘాలపై వర్షాన్ని
కురవమన్నట్లుంది
నీ వలా లేస్తూ కదులుతుంటే
జలపాతాలు సన్నసన్నగా జారుతున్నట్లు
యవ్వనమంతా నాభి సంద్రంలోంచి
ఉబుకుతున్నట్లు
మనోనేత్రంలో దృశ్య పరిమళాలు
పరవళ్లు తొక్కుతున్నాయి
మౌనం వెనకాల దాగిన
ఆంతరంగిక భాషతో
నన్ను అలా నడిపిస్తున్నావ్
నీ పెదవులపై తేనెపిట్టలా
వాలమని పంపిన సంకేతాలు
ఇంకా కళ్లల్లో దృశ్యాలుగా
తడుపుతూనే ఉన్నాయి.


http://www.andhrabhoomi.net/node/248531

09-08-2015

No comments:

Post a Comment