Saturday 31 August 2019

ఓ దుఃఖ ప్రవాహం

ఓ దుఃఖ ప్రవాహం
Published Saturday, 24 August 2019
ఈ దుఃఖ ప్రవాహాన్ని ముక్కలు చేయలేకపోతున్నాను
నీరెండిన బతుకులాంటి జీవన ప్రవాహంలో
వేలాడే దృశ్యాల్ని ఎటూ నెట్టలేకపోతున్నాను
బదులివ్వలేని ప్రశ్నలతో సతమతవౌతూ
ఏళ్లనాటి దుఃఖాన్ని రెండు నదులుగా
ముఖ గోళంపై జార్చుకుంటూ...
ఒక సమయానికి వచ్చే నీ రాకే
నాలో ఎత్తుపల్లాలు తెలీని ఆనందంలో ముంచేది
కొండలు ఎక్కి వాగులు దాటి తోటలు తిరిగి
నీలో పొంగిన నా ఆనందాన్ని
నీతో నడిచే వికాసాన్ని నాలో చూసుకునేవాడిని..
కాలమెంత కఠినమైనదో కదా
మనసు నొదిలి
ఆ క్షణం నిర్ణయాలు వెలుగుల వెంట
పరుగులెత్తాయి.
సూర్యోదయం నీతో అయినట్లే
సూర్యాస్తమయం నీతోనే ముగిసింది
దిక్కులు మారాయి
మనసులు బరువెక్కాయి
రెక్కలే ఉంటే ఏ దిక్కున నీవున్నా
నీ ముంగిట వాలేవాడిని
ఆ రోజులు లేవు
రాతిరి పూట
నిదురించే ఆకాశంపై చందమామను
ఒక దగ్గర నుంచి చూసే రోజుల నుంచీ వేరయి...
ఇప్పుడు చెరో దిక్కు నుంచీ చూస్తున్నాం
రాని వెనె్నల కోసం ఆరాటపడుతూ...
-గవిడి శ్రీనివాస్.. 9966550601

No comments:

Post a Comment