Wednesday 23 December 2020

కన్నీళ్లు సాక్ష్యం రచన : గవిడి శ్రీనివాస్

ముందుగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండప్రతాప్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో నమస్కరిస్తూ... పుస్తకం పేరు : కన్నీళ్లు సాక్ష్యం పరిచయ కర్త : జ్యోతి మువ్వల రచన : గవిడి శ్రీనివాస్ గారు నివాసం : బెంగళూరు వృత్తి : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ కవి గవిడి శ్రీనివాస్ గారి పరిచయం రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులకు సుపరిచితమే. నేటి జీవితాలలో వాస్తవ సంఘటనలను తీసుకొని కవితగా మలుస్తారు గవిడి శ్రీనివాస్ గారు. అలా రాసిన పుస్తకమే కన్నీళ్లు సాక్ష్యం. కవి కన్నీరే కవిత్వం అవుతుంది. ఎందుకీలా చెప్తున్నాను అంటే గవిడి శ్రీనివాస్ గారి కన్నీటి సాక్ష్యం కవితాసంపుటి అభివ్యక్తి విధానంపై అతనికి శ్రద్ధ ఉందనటానికి నిదర్శనం. ఆవేదన భరితమైన కవిత్వం నేటి సమాజానికి అవసరమైన ధోరణి. ఎందుకంటే తుఫానులా మారుతున్న అవాంఛనీయ సంస్కృతిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని సామాన్యుడు ప్రతిక్షణం పొందుతున్నది ఆవేదనయే! నెత్తుటి కన్నీళ్లు సాక్ష్యం! అనే కవిత చదివినప్పుడు నేటి సమాజ పోకడలో పతనమైన మనిషి జీవితం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. నాలో భావాలు నీవి కానప్పుడు జ్వలించే కల గుండెను దహించక మానదు.. సవాలక్ష సంభ్రమాశ్చర్యాలలో కూలిన బతుకు సమాధి గడ్డకట్టిన నెత్తురు శ్వాస బందీ మూగ జీవి కులుకుతూ లేస్తున్న.... అంటూ రాసిన ఈ కవితలో పతనమైన మనిషి దీనస్థితిని వివరించారు.ఇదే మాటను డాక్టర్ అద్దేపల్లి రామ మోహన్ రావు గారు పుస్తకం ముందుమాటలో ప్రస్తావించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రైవేటైజేషన్ ద్వారా కొంతమందిని అత్యంత ధనికులగా మార్చివృత్తి పనులు చేసే వారికి జీవించే హక్కుని దూరం చేయడం ద్వారా రైతు, నేతగాడు, రజకుడు ఇలా ఎందరో చేతి ఉత్తి వాళ్ళు... పీడిత వర్గాలు దిక్కులేని స్థితిలోకి నెట్టి వేయబడ్డారు. అలాంటి పరిస్థితులను చూసినపుడు కవి హృదయం దహించుకు పోతుంది. ఆ ఆవేదనలో నుంచి పుట్టిన కవిత్వమే కన్నీళ్లు సాక్ష్యం. ఈనాటి కవులలో ఈ ఆవేదన విశ్వ రూపం పొంది తమ కలాలను ఆయుధాలుగా మార్చి కలం అనే గళంతో తమ అభిప్రాయాలను బలంగా పాఠకుల ముందు ఉంచుతున్నారు. అలాంటి వారిలో మన గవిడి శ్రీనివాస్ గారు ఒకరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అల్లుకున్న మేఘాలలో నేత వారి జీవిత దైన్యాన్ని వర్ణించారు గవిడి శ్రీనివాస్ గారు. * చిన్నగూటి దివ్వలో ఈ సంజెవేళ సూర్యోదయం మౌతుంది.* చిన్న గూటిదివ్వె పేద తనానికి సంకేతమైతే... సంధ్యవేళ జీవిత సమస్యల్ని ధ్వనింప జేస్తుంది. చిన్న దివ్యలో సంధ్య వేళలో సూర్యోదయం కావడం అంటే అస్తమిస్తున్న సూర్యుడు వెలుగు ఎంత స్వల్ప పరిమితి కలిగిందో వారి జీవితాలు కూడా అంతే స్వల్ప పరిమితి కలిగి ఉందని వ్యక్తపరుస్తుంది. అలాగే చిన్న ప్రమిదలోని ఒత్తు ఎంత వెలుగునిస్తుందో వారి జీవితాలలో వారు చేసుకునే వృత్తి పనులే వారికి జీవితఆధారం అని అర్థమయ్యేలా వృత్తి పనుల వారికి వారి వృత్తి ఎంత ప్రధానమైనదో అది ఎంత గొప్పదో అర్థవంతంగా చెప్పారు. వృత్తి కార్మికుల గురించి వివరించే చాలా కవితల్లో శ్రీనివాస్ గారు వలస కార్మికుల గురించి వర్ణించారు. నాడు వృత్తి పనులలో దగాపడితే ప్రస్తుతం అసంఖ్యాక కార్మికులు కడుపు పట్టుకొని కూలి కోసం నగరాలకు వలస పోవడం అతిసాధారణ దృశ్యం... అతి ముఖ్యమైన అంశం అని పదే పదే చెప్పటం కవి సామాజిక స్పృహకు, మెలుకువకు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో చాలా కవితలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. మట్టి స్వరాలు,విరిగిన వెన్నుముక,కాలంగాయమై తట్టింది,మూగబోయిన పల్లె, మట్టి నవ్వు.... సూర్యోదయతో పక్షులు ఆకలి వలసకు అతుక్కు పోయినట్లు మా వెంకట్రావు దేశం మెల్లిపోయాక వాడయ్య కొడుకు మీద కలలు పరిమలించే లోపే కళ్ళుతేలేసాడు రెక్కలు ఎగరేసుకుని డబ్బులు మోసుకు రావాలని వెళ్లిన వెంకట్రావు కన్నీళ్ళను గోనెసంచిలో మోసుకొచ్చాడు అంటూ వలస వెళ్లిన కార్మికుల జీవితాలను అద్దంపట్టేలా... ఒక వయసు మళ్ళిన వాళ్ళు ఏ ఆధారము లేక ఏ చిన్న పనో చేసుకుంటూ ఒంటరితనాన్ని మోసుకుంటూ చివరి క్షణాలలో ఎదురు చూసే పరిస్థితులను శ్రీనివాస్ గారు చక్కగా వివరించారు.అలాగే నిర్లిప్త సంధ్య అనే కవితలో ఒక ఒంటరి ముసలివాని జీవితాన్ని కళ్లకు కట్టినట్టు అభివర్ణించారు. నిద్దుర రాదే అమ్మ అనే కవితలో రేపటితరం వాడి నోటా మాట్లాడించడం అభివ్యక్తి రీత్యా బలమైన అంశం. పసివాడి భావాలను వాడి నోటనే వినాలి అంటూ రాసిన కవితలోని కొన్ని పదాలు మీకోసం భరించాల్సిన బాణీలెన్నో చెల్లి పోయాయి 'పాప్' సంగీత ఝురిలో అభిషేకంగావించాల్సిన వాడిని ఆనవాళ్ళు కలగా, ఒక అనుభూతిగా నిలబెట్టుకోవే! సానబెట్టిన కంఠాన్ని చిలికి వెలికి తీయాలేతప్ప నీ పాటకు చెట్లు తల ఊపవు జంతువులు గంతులేయ్యవు గాని అన్నీ పాశ్చాత్య ఉగ్గుపాలు తాగుతుంటేనూ... నిద్దుర రాదే అమ్మ...! కవిత్వం హృదయాలను కదిలించాలి కొత్త భావాలను పలికించాలి. ఆ కవిత చదువుతున్నప్పుడు ఆలోచనలను రేకెత్తించాలి .వస్తువుకి తగిన శైలి ఉన్నప్పుడే ఆ కవితకు మంచి రూపం వస్తుంది. అలాంటి రూపం ఉన్న కవిత ఇది. వ్యవసాయాన్ని మన చేతి పనులను మన విద్యా సంస్కృతులను కాపాడుకునే దిశగా ఉద్యమించాలి అని కవి గారి ఉద్దేశం. ఆ దిశగా ప్రయత్నిస్తున్న అక్షర సైనికుడు గవిడి శ్రీనివాస్ గారు. గవిడి శ్రీనివాస్ గారు మరిన్ని మంచి కవితా సంకలనాలతో ముందుకు సాగాలని అద్భుతమైన కవితలు రాయాలని ఆకాంక్షిస్తూ ఉత్తమ స్థాయి సంపుటాలను మరెన్నో ప్రచురించాలని కోరుకుంటు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన జాషువా అవార్డు గ్రహీత అక్షర తపస్వి శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి, కార్యనిర్వాహక సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పుస్తక పరిచయాన్ని ముగిస్తున్నాను. ✍️ జ్యోతి మువ్వల 22/12/20 Attachments area

No comments:

Post a Comment