Tuesday 6 September 2016

కాసేపు నీతో ప్రయాణం ..

కాసేపు నీతో ప్రయాణం ..

రచన: గవిడి శ్రీనివాస్
ఆ కాసేపు
నీతో పయణించిన క్షణాలు
మల్లె వాసనలూ
మౌన రాగాలూ
అలజడి రేపుతున్నాయి
నీ వేదో చేస్తావనీ కాదు
మనసు తలుపు తడితే
ఒలికిపోయే
వెన్నెల సమీరాల్లో
తడిసి పోయిన వాణ్ణి
నీ వేదో చెప్తావనీ కాదు
కనుల భాషలో
రాలిపోయే
పువ్వుల్ని ఏరుకుందా మనీ
మూసుకున్న కళ్ళల్లో కలల్ని
నీ పరిచయాలు గా
పదిల పరచు కోవాలనీ
ఆరాట పడుతుంటాను
మరి కొన్ని క్షణాల్లోనే
దూర మౌతుంటాను.
కాలం సాగుతున్నకొద్దీ
అక్షరాల పక్షిలా
నేను వాలుతుంటాను
ఒకటి ఒకటిగా ఏరుకుంటూ
నీవు చదువుతుంటావు
నీలో మూగ వేదన
భళ్ళున పగిలి
తరంగాల ధ్వనితో
చేరువౌతావు
అపుడే
ఆ కాసేపు
నీతో ప్రయాణించిన క్షణాలు
జల్లున కురిసి
వరదలా దొర్లుతుంటాయి

http://magazine.maalika.org/2016/09/01/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B1%87%E0%B0%AA%E0%B1%81-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82/
Print Friendly

No comments:

Post a Comment