Sunday 3 June 2018

మరి! వస్తానూ

Praja Sakti today aksharam

http://epaper.prajasakti.com/c/28661531

మరి! వస్తానూ ..!! -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601

ఈ కళ్ళలోంచి విస్తారంగా నడచిన
చూపుల మేఘాలు
కాస్తంత దట్టంగా కాస్తంత బరువు గా
కోరుకుతున్న బాధ లా
నన్ను చుట్టుముడతాయి .

నీ వెళుతున్నావనీ
ఎత్తిన చేయి దించకుండా అలా ఊపడమే మొదలు
మనసుని సమాధాన పరచుకోలేక
కన్నీళ్లను రెప్పల సంద్రం లో దాచలేక
ఉబుకుతూ ఊగుతూ
వీస్తున్న తుపాను లోంచి జారే నదిలా
అలా నన్ను తడిపి పోతాయి .

జీవితాన్ని అనుభవాల తో కాగి
పెనవేసుకున్న బంధాలు గుండెను అలా లాగి
కాలం రెక్కల పై
కర్పూరం లా వెలిగి కరిగి పోవడం తప్పా
దేన్నీ ఆపలేని చిట్టి గుండె చివుక్కుమంటుంది .

ఎప్పుడు ప్రవేశించావ్
ఇప్పుడు కాస్తంత దూరంగా ఎందుకు ఎందుకు నిష్క్రమిస్తున్నావ్ .

దూరం కొలతలు తెలీవు గానీ
దూరం గాయాల్ని తడుతుంది .

నీతో భౌతిక ప్రపంచం వేరు
నీతో మాటాడిన క్షణాల రూపం వేరు

రెప్పల ముందు రెపరెపలాడుతూ
నా చేతి వేళ్ళ సందుల్లోంచి
నీవు దుఃఖం గా జారిపోతుంటే
ఉక్కబోత లో ఊపిరాడక
ఇంతితై జీవితం చీకటి తెరలు కప్పిపోతున్నట్లు
నేను ఒక నీ జ్ఞాపక దృశ్యం గా రాలిపోతాను .

'మరి వస్తానూ ' అన్న నీ మాట తో
మూగ బోయిన క్షణాల్ని ఆ దృశ్యాల్ని
కను గుడ్ల లో చెరిగి పోనీ చిత్రాలు గా బంధిస్తూ
భరోసా లేని బతుకు వైపు
నిర్లిప్తంగా కదులు తూ
కాలం కలుక్కుమంటుంది .




May 2018 Telugu vidyarthi mothly

No comments:

Post a Comment