Sunday 2 December 2018

నేనో ధిక్కార స్వరాన్ని




http://epaper.suryaa.com/c/34529884

03-12-2018


నేనో ధిక్కార స్వరాన్ని -గవిడి శ్రీనివాస్  7019278368

నేనొక బాధాతప్త  హృదయ స్వరపేటిక పై 
నినదిస్తున్న అకుంటిత దీక్షా శిబిరాన్ని 
ఆప్త వాక్యాన్ని  ఆర్తనాదాల చేయూత  ధీరుడ్ని
శిరసు ఎత్తి శంఖారావం  పూరించే యుద్ధ యోధుడ్ని 
మాటల కోటలు కూలిపోతే 
రెపరెప ఎగిరే ఎర్రని పతాకాన్ని 
నమ్మకం ముక్కలు చేసే గుండెల్లో 
సింహస్వప్నాన్ని .

ఒక అల్లూరి ఒక చేగువేరాల్ని 
నింపుకున్న  పోరాట తూటని.

నీరులేక పంటే ఎండి పొతే 
కాగుతున్న రైతు క్రోధాగ్నిని .
ఒక బాధా సంద్రాన్ని .

ఉపాధిలేక  వలసే పొతే 
బతుకును మోసుకు పోయే 
వలసవాద వ్యతిరేక సమరాన్ని .

ఆకలి పేగులు తీగలై మోగుతుంటే 
ఒక సామ్రాజ్యం  వాగ్దానాల కింద 
నలిగిపోయిన  సామాన్యగొంతుని .

మెలకువలేని రాజ్యాధిపతులకి 
ఒక జ్ఞాన  బోధ వృక్షాన్ని .

పీడిత హృదయాలకి ఎదుర్కోవటం నేర్పే 
గెలుపు పాఠాన్ని .

ఇంకా 
దుఃఖాన్ని ఎన్నాళ్ళు మోయాలి 
మోసాన్ని న్యాయమని  ఎన్నేళ్లు నమ్మాలి .

విషణ్ణ వదనాల్ని మూటకట్టుకునే 
సాగు జీవితాల్ని ఎన్నేళ్లు  చూడాలి 
ప్రపంచం మారినా రైతు జీవితం అదే .

హామీలు కురిసినా 
అమలు అందుబాటుకు కుదరదే.

పల్లెకూ కొత్త శోభ రావాలి
అభివృద్ధికి  మూలం పల్లెకావాలి .

భళ్ళున కూలిపోతున్న స్వప్నాల్ని 
నిర్మించేదెపుడు !

కార్మిక సంరక్షణ  హరించే 
కాంట్రాక్టు వ్యవస్థ కూలేదెపుడు.

నాకిప్పుడు సమాధానం కావాలి 
సమాధానం లోంచి  చైతన్యం వెలగాలి .

నేనొక 
శ్రమ దోపిడీ  వ్యవస్థను  కూలదోసే
ఒక పదునైన ఆయుధాన్ని .

నేనో ధిక్కార స్వరాన్ని
అన్యాయపు  అడుగులపై 
ఎగసి పడే  కీలాగ్నిని 
సమరం నా అభిమతం కాదు 
న్యాయ శంఖారావమే  నా లక్ష్యం .
న్యాయమే  నాలో  మోగే మృదంగం !
ఇదే నా తత్త్వం ! నా జవసత్వం !!

No comments:

Post a Comment