Tuesday 14 May 2019

గూటికి చేరే ముందు

గూటికి చేరే ముందు

ఇన్ని రోజులు గడిచాక 
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ 
ఒంటరి ఇల్లును వదిలి 
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా 
మనసు నిలకడా లేదు 

చుట్టూ చూస్తున్నాను
ఆదరించే ప్రపంచం నెలకొని ఉంది 
ఒకచోట ఉండాలనే ఉంటుంది 
వీచే గాలులు ఉరిమే ఉరుములు 
ఏవీ నాలో నన్ను అట్టే ఉండనీయవు 

ఏదో ముందుకు లాగినట్లు 
గెలుపేదో ఒక మార్గం నిర్ధేశిస్తున్నట్లు 
కాలాల్ని ఆనుకొని స్థలాలు మారతాం

నా వాకిలి రోడ్డును చూస్తూ 
నా పెరటి చెట్టును ఆస్వాదిస్తూ 
కాసిన్ని అడుగుల్ని ముందుకు నడిపాను
నాలాగే దూరం వచ్చి 
సొంతూరు పోవాల్సినవారు కలిశారు 
జీవితమూ మనసూ మారలేదు
కాస్త ఆర్థిక ప్రమాణాలు తప్ప!

ఇపుడొకటనిపిస్తుంది
ఉదయం ఎగిరిన పిట్టలు చెట్టునొదిలి ఉండలేవు 
మళ్ళీ గూటికి 
అలసి సాయంకాలం వాలింది!

- గవిడి శ్రీనివాస్‌
99665 50601

No comments:

Post a Comment