Saturday 25 May 2019

జీవనది


Vaartha sunday daily 19-05-2019

జీవనది - గవిడి శ్రీనివాస్  9966550601 ,7019278368   

ఒక ప్రవాహానికి కదులుతున్న. ప్రతిబింబం లా నేను
తడి చూపుల్ని ఆరేసుకున్న చెట్టు లా ఈ ఒడ్డున
ఏకాంతర అంతరంగ మధనంలో విరిగిపడే ఒక నేను.

జీవన గమనానికీ ఆంతరంగిక ఆలోచనకీ
ప్రవాహిని ఈ జీవనది
నీటిలా పారే మనసు కి
విశ్వాస బలం తో అంతఃకరణ శుద్ధితో
కర్మ లు శుద్ధి గావించబడతాయి.

భౌతిక భవ బంధనాలు చుట్టుకుంటూ
భోగ విలాసాలు రెక్కలు చాచుకుంటూ
మనిషి ని నిశ్చలంగా  ఉండనీయవు..

ధ్వజమెత్తిన కాంక్షా స్ధాయిలు
సనాతన ధర్మాలని సైతం 
వినాశం వేస్తాయి..

తులనాత్మక పరిశీలన లో
లౌకిక వైభవములే జీవిత
పరమార్థాలు గా కనిపిస్తాయి..

ఆధ్యాత్మిక సంపూర్ణ. ప్రపంచంలో
రక్షింపబడేవి ధర్మపక్షాన ఉంటాయి.

ఇప్పటి ఆలోచనలు నాలో ప్రవాహ వేగమై
ఇలా ఈ నది ని నాలో నింపుకోవడం
అలలు అలలు గా తేలిపోవడం
గులక రాళ్ళ శబ్ద సంగీతం లో మునిగిపోవటం
జీవిత సాన్నిహిత్యాన్ని సన్నిహితంగా చూడటం
నిర్మలంగా పరిపూర్ణంగా
ఆలోచన వాకిళ్ళను చూడటం  నాకిష్టం..

ఆకాసంలో రెక్కలు మొలిచినట్టు
జీవనది ని ఎత్తుకు పోయినట్లు
నాడుల్లో నీటి ప్రవాహాలు జీవ నదులవుతున్నాయి
జీవ నదులు జీవిత మవుతున్నాయి.. 

No comments:

Post a Comment