Tuesday 23 June 2015

పరిమళించే భావ కుసుమాలు

  • -మానాపురం రాజాచంద్రశేఖర్
  •  
  • 06/06/2015

వలస పాట (కవితల సంపుటి)
గవిడి శ్రీనివాస్ కవిత్వం
ప్రతులకు: రచ యత
గాతాడ- 532127,
మర్రివలస (పి.ఓ)
రాజాం (ఎస్.ఓ.)
విజయనగరం (జిల్లా)
ఆంధ్రప్రదేశ్
సెల్: 08886174458, 09966550601
మనసు పడే ఆరాటం మనిషికి తెలియాలంటే జీవితం సౌందర్యవంతం కావాలి. సరికొత్త సందర్భ దృశ్యాన్ని ఏరుకుని భావచిత్రాలతో ప్రతిబింబింపజేయాలి. ఈ తపన ఆధునిక అభివ్యక్తిలోంచి భావుకతగా ఊపిరి పోసుకోవడం కళాత్మకంగా మారుతుంది. కవితాత్మకంగా అలంకారాలను రూపుకట్టిస్తుంది. ఇందులో దగ్ధసౌందర్య అనే్వషణ కూడా ఉంటుంది. వెల్లువెత్తుతున్న వర్తమాన, సామాజిక సంఘర్షణల రాపిడితో చూపుకూడా పదునుదేరుతుంది. అనుభూతి పరవళ్ళుతొక్కి ద్రవీభూత చలన స్థితితో ప్రకృతి పరిశీలనలో మునిగితేలేలా చేస్తుంది. ఈ యాంత్రిక జీవితంలోని స్తబ్దతల్ని బద్ధలుకొట్టి దానితో ఒక అనివార్యమైన ఉపశమన స్థితిని పొందడానికి వైవిధ్యమైన మార్పుల్ని, కోరుకోవటం ప్రాణికోటికి సహజం. అలాంటి ఆలోచనలకి అక్షరబీజాల్ని నాటి కవితల తోరణాలు కట్టిన కవి అంతర్ముఖ చిత్ర దర్శనం ఈ కవితా సంపుటి. 50 శీర్షికలతో విలక్షణమైన కవితాపంక్తులు ఆసాంతం రసార్ద్రపూరితం చేస్తాయి. బహుముఖ కోణాల స్పర్శతో అలసిసొలసి మోడువారిన మనసుల బతుకుల్లో వసంత కాలపు తలపుల తలుపుల్ని తెరుస్తాయి. ఈ అనుభవాల ఊగిసలాటలోంచి పరవశించిపోతూ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన కవితాదృశ్యాల్ని కొన్నింటిని వీక్షించే ప్రయత్నం చేద్దాం.
‘‘తీరాన్ని, తాకాలని/ ఆరాటపడే అలల్లా
మండుటెండ జీవితంలో మంచు బిందువుల్ని పోగుచేసి
పొడి అనుభవాలకి/ తడి స్పర్శ
ఊపిరి ఊదుతుంది’’ అంటాడు ‘అలల తాకిడి’ కవితలో ఒకచోట కవి. సందర్భాన్ని కవిత్వం చెయ్యడం అందరికీ చేతకాదు. లోచూపుతో దృశ్యాన్ని ఒడిసిపట్టుకొని అపురూప క్షణాలమధ్య పరిస్తే- ఆ అనుభూతి ఆస్వాదనే వేరు. చిరకాలం ఇంకిపోని దృశ్యంలా మనసుపొరల్లో గాఢంగా నాటుకుపోతుంది. ఇక్కడ కూడా అలాంటి తాపత్రయమే చోటుచేసుకుంది. పొడిపొడి అనుభవాలు నిరాశానిస్పృహల్ని రాజేస్తుంటే, ఎండి గడ్డకట్టుకుపోయిన విషాద సందర్భాల్లో తడిస్పర్శ కలిగించి జీవితాన్ని చైతన్యవంతం చెయ్యడం ఒక మహత్తరమైన ఘటనకు దారితీస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రయోజన ఫలితానే్న ఈ కవిత మననుంచి ఆశిస్తున్నాడు. అది సఫలీకృతం కావాలనే కోరుకుందాం.
‘కొవ్వొత్తి’ కవితలో ఇంకోచోట ఇలా చెబుతాడు.
‘‘కొద్ది సమయం/ చేతుల్లోంచి జారిపోయాక
ఎంత చీల్చినా/ ముక్కలుకాని చీకటి
శూన్య ప్రకంపనాల్ని విరజిమ్ముతోంది’’ అంటున్నపుడు ధ్వనించే వ్యతిరేక భావన పలు సామాజిక కోణాలను ప్రాపంచిక దృక్పథంతో మెలిపెట్టి చెప్పడం గమనించవచ్చు. ‘దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలనే’ తపన తీరని ఆరాటంగా కవిత్వంలో తొణికిసలాడుతోంది. కాలం విలువను పసిగట్టడంతోపాటు- మిగిలిన సమయాన్ని పొదుపుగా వాడుకోవాలనే స్పృహను కవితాత్మక దృష్టితో అధ్యయనం చేసి సూక్ష్మదృష్టితో చెబుతాడు కవి. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి.
‘‘తీరాల ఆవల/ సంకెళ్లతో నీవు
బంధనాల బందీని నేను/ గుర్తొచ్చి
జ్ఞాపకాలతో ఏం మాట్లాడను?’’ అంటూ ఎదురుప్రశ్నిస్తాడు ‘నీవు రాగలవా’ కవితలో.
వలస పేరుతో ధన సంపాదనకోసం దూర తీరాలైన విదేశాలకు ఎగిరిపోవడం రెక్కలొచ్చిన పిల్లలు చేస్తున్న పని. వాళ్ళ రాకకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూడడం పెద్దవాళ్ళ వంతయ్యింది. అందులోనూ వృద్ధాప్యంలోని ముసలివాళ్ళ గోడైతే ఆ బాధ చెప్పలేనంత వర్ణనాతీతం మరి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నవేళ... కలిసున్న ఉమ్మడి క్షణాలు తీపి జ్ఞాపకాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ మానసిక సంఘర్షణను సంక్లిష్ట సమస్యగామార్చి కవిత్వంగా మనముందు పరిచారు ఈ కవి. ఈ వెదుకులాటలో మననుంచి మనమే దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
‘వేకువ రాల్చిన కిరణాలు’ కవితలో గతంలోంచి వర్తమానాన్ని తడుముతూ, దొర్లిపోయిన అనుభవాలను అనుభూతుల ద్వారా పొందుపరిచి, గాఢతను సాంద్రతరం చెయ్యాలనే ఆవేశం కనబడుతుంది.
‘‘దూస్తున్న మంచు వెనె్నల్లోంచి/ వేకువ రాల్చిన కిరణాలకి
తుంపర భావాలు ఆవిరౌతూ/ తనువు చాలిస్తుంటాయి’’
నిత్య దినచర్యలో భాగమైన చీకటి వెలుగుల మిశ్రమ కలయిక రేయింబవళ్ళుగా పరిణామం చెంది కొత్త సూర్యోదయ ఆవిర్భావానికి దారితీస్తుంది. అలా రాల్చిన వేకువ కిరణాలకు తుంపర భావాలు ఆవిరవుతూ అదృశ్యమవడాన్ని అంతిమదృశ్యంగా పోల్చిచెప్పడం దీని ప్రత్యేకతకు నిదర్శనం. అంటే తనువు చాలించడమన్న మాట. ఇది వర్తమాన కాలానికి అన్వయించి చెప్పడమే ఈ కవి ఊహకి తట్టిన ఉద్దేశం. ఈ ప్రయత్నంలో సంప్రదాయక భావజాలంనుండి ఆధునిక సమాజాన్ని, వేరుచేసే దూరదృష్టి కనబడుతుంది.
అనుభూతి పరాకాష్ఠ దశకు చేరినపుడు ‘ఒక తుళ్లింత’ లాంటి కవిత ఊపిరిపోసుకుంటుంది.
‘‘సన్న సన్నగా/ జాలువారుతూ
రెప్పల మీద/ తూనీగలా వాలింది వర్షం’’ అని అంటాడు కవి. ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులు కారణంగా... వర్షం చినుకులుగా తూనీగ స్పర్శతో కురిసి మనసుని ఉల్లాసపరుస్తుంది. ఈ స్థితిని బొమ్మకట్టించడంలో కవి పడే ఆరాటం ఆరాధనగామారి కవిత్వంగా కురుస్తుంది.
ఇలా చెప్పుకుంటూపోతే పదాల అంచులమీద ధారగా కురిసే కవితాపంక్తులు ఎనె్నన్నో.. ఈ సంపుటిలో తారసపడతాయి. వీటి లోతుల్ని అక్షరస్పర్శతో తడిమే ప్రయత్నం చేద్దాం.
‘‘మాటలురాని వలస పక్షులు/ కాలం అంచులమీద అలసిపోతున్నాయి’’ అని అంటాడు కవి ఒకచోట. మరొకసారి వర్ణిస్తూ ‘‘విధ్వంసాలైనా/ కొన్ని సౌందర్యంగానే ఉంటాయి’’ అంటూ చెప్పుకుపోతాడు.
ఇలాంటివే ఇంకొన్నింటిని కలవరించి పలవరిద్దాం-
‘‘కిరణాల కౌగిలింతలకి/ రాలుతున్న సందర్భాలు’’, ‘‘సమస్తం ముక్కలయిన/ ఒక వాస్తవం/ ఈ జీవితం’’, ‘‘కన్నీటిని ముద్దాడే/ నీ పెదవుల స్పర్శ/ ఏ గాలికీ చెదిరిపోదు’’, ‘‘వేకువ అలల్ని/ అలా తొలిపొద్దుగా/ ఆశగా జారనీ’’, ‘‘ఎంతకూ వదలని/ కరువు బతుకు మీద/ దరువు ఈ చినుకు’’, ‘‘చరిత్ర గుండెల్ని పిండినపుడల్లా/ రాలుతున్న వలస పాటలు’’, ‘‘ఊపిరి కొనలమీద చలి రాపాడుతూనే ఉంది’’, ‘‘వొణికిన రాగాలు/ తడిసి ముద్దవుతున్నాయి’’, ‘‘కళ్ళల్లో మెరుపులు/ లేత యవ్వనాల్ని శృతి చేస్తున్నాయి’’, ‘‘రాలిన గతం/ తడిపిన జ్ఞాపకమై/ మనసు పట్టాలమీద పోతుంది’’, ‘‘చూపుల్ని ఆకాశానికి విసురుతున్నా/ చినుకు సమాధానం చిక్కలేదు’’, ‘‘ఊహల లోగిళ్లలో దృశ్యాలను వెదుకుతూ నేను’’, ‘‘గుండెల్లో శిలల్ని మరిగిస్తూ/ వెనె్నల పువ్వుల్ని రాల్చేసుకుంటాను’’, ‘‘మట్టి నరాలు తెగినచోట/ పచ్చదనం శ్వాసించదు’’, ‘‘ప్రపంచీకరణ పొదిగిన గాయానికి/ పిల్లలు పక్షులై/ ఎక్కడెక్కడో వాలడం’’, ‘‘అరమోడ్పు కళ్ళలో ఒదిగిన/ ప్రకృతి భాషాస్వరాలు’’, ‘‘చల్లని సాయంకాలానికి తెర తీసి/ కొబ్బరి రెమ్మల్లోంచి/ జారిపోతున్న సూరీడు’’, ‘‘ఎప్పటికీ తెరవని ఉపాధి ద్వారాలు/ సూర్యోదయాల్ని చీకట్లో బంధించాయి’’, ‘‘కత్తికి తెగని బాధ ఇది’’, ‘‘కాలుష్యం అడుగుల నడకలో/ నిలువునా రాల్తున్న బతుకు రాగాలు’’, ‘‘నాలో ఒక వేకువ పిట్ట/ వెలుగు రేఖల్ని/ చిన్ని కొవ్వొత్తిగా నిలుపుతుంది’’ వంటి కవితాత్మక వ్యాసాలు ఊహలకు చక్కిలిగింతలు పెట్టి సరికొత్త ఆలోచనల్ని తట్టిలేపుతాయి.
ఇలాంటి ఊగిసలాటలోంచి భావుకతకు పెద్దపీటవేసి వర్తమాన కాలానికి దర్పణంగా నిలుస్తాడు ఈ కవి. అడుగడుగునా భావచిత్రాలు, అలంకారాలతో అల్లుకుపోతాయి. ఇలా కవిత్వంతో కరచాలనం చేసిన ఈ కవి ఎవరో చెప్పలేదు కదూ. అతని పేరు గవిడి శ్రీనివాస్. తన కవితాసంపుటి ‘‘వలసపాట’’. పేరుకు తగ్గట్టుగానే ఇది ఉత్తరాంధ్ర జీవన ముఖ చిత్రాన్ని తడుముతుంది. సరళమైన కవిత్వ భాషతో సహజంగా సాగిపోతుంది. ఇంత మంచి సంపుటిని పాఠకలోకానికి అందించిన కవిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుదాం!

06-june-2015

No comments:

Post a Comment