Tuesday 23 June 2015

కవిత్వాన్ని భావుకతతో తడిపిన 'వలస పాట'

Posted On Sun 10 May 22:27:03.992043 2015
                   ప్రతి కవికి జీవితంలో ఊగిసలాట తప్పనిసరి. పలు సందర్భాల్లోంచి ఈ స్థితి చోటుచేసుకుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి కోణాల్లోంచి స్తబ్దతను బద్ధలు కొట్టడానికి చేసిన సృజనాత్మక ప్రయత్నమే కవిత్వ రచన. ఇది అప్పటి మానసిక పరిస్థితిని అద్దం పట్టిస్తుంది. సరికొత్త ఆలోచనలకు గీటురాయిగా నిలుస్తుంది. కాలం ఎలాంటిదైనా సామాజిక స్థితిగతుల నేపధ్యమే దీనికి పరోక్ష ప్రేరణ. అంతర్గత సంఘర్షణలకు అక్షరరూపమే ఈ భావ పరంపర అన్వేషణ. ఇలాంటి భావోద్వేగాల స్ఫూర్తితో ఊపిరి పోసుకున్నదే వర్తమానం కవిత్వం.
గవిడి శ్రీనివాస్‌ దశాబ్దంన్నర కాలానికి పైగా కవిత్వ ప్రక్రియతో దూసుకుపోతున్న కవి. అనేక వర్తమాన సంక్లిష్టతలతో, సామాజిక భావ వైరుధ్యాలతో నిత్యం రగిలిపోతూ ఆరాటపడటం అలవాటు చేసుకున్నాడు. ఈ నేపధ్యంలోంచి తనదైన కవిత్వ గొంతుతో 'వలసపాట' కవితా సంపుటిని తీసుకొచ్చాడు. ఇది రెండవది. అంతక మునుపు 'కన్నీళ్ల సాక్ష్యం'తో సాహితీలోకంలోకి అడుగుపెట్టాడు. ఈ సారి వేసిన అడుగు చాలా బలంగా, చిక్కగా, కవితాత్మాకంగా ఉంది. భావుకత వెల్లువెత్తి అడుగడుగునా మనల్ని చుట్టుముడుతుంది. ఈ తపనంతా ఇతని కవిత్వంలో తొణికిసలాడుతుంది. 'అలల తాకిడి' కవితలో తన అభిప్రాయాన్ని సునిశితమైన పరిశీలనతో కుండబద్దలు గొట్టినట్లుగా చెబుతాడు.
''కాలాలు ఎన్ని నడిచినా/ శ్రమకు ఉపశమనం
చీకటికి ఉషోదయం/ అనివార్యమే' అంటాడు శ్రీనివాస్‌. ఇలా అంటున్నప్పుడు గవిడిమాటల్లో జీవన వాస్తవికత తొంగిచూస్తుంది. ఆలోచనా విధానంలో స్పష్టత గోచరిస్తుంది. జీవితాన్ని కాచి ఒడబోసిన అనుభవం రూపుకడుతుంది. శారీరక శ్రమకు విశ్రాంతిని చీకటి మింగిన వెలుగులోనే ఉందనే సత్యాన్ని పాఠక ప్రపంచానికి గుర్తుచేస్తాడు.
'విష వలయం' శీర్షికలో ఆధునిక సమాజంలోని యాంత్రికతనాన్ని డొల్లతనంగా బయటపెడతాడు. నవ నాగరికతలోని ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యాన్ని కళ్ళకు కట్టిస్తాడు శ్రీనివాస్‌.
''బాస్‌ సెల్లుమోత మనసుని ఛిద్రం చేసి / గ్లోబల్‌ గీతలు గీసి/ టార్గెట్‌ విషాన్ని చిమ్ముతూ/ కొసమెరుపుగా ఆశను వేలాడదీస్తుం'' వర్తమాన సందర్భాన్ని అక్షరీకరించడంలో ఆరితేరినతనం కనిపిస్తుంది ఇందులో. అంతర్జాతీయ విఫణిలో సంక్లిష్టమవుతున్న మానవ జీవితాలన్నీ జీతపురాళ్ళకు అమ్ముడుపోయిన తీరును బహిరంగ ప్రకటన ద్వారా విశదపరుస్తాడు కవి. దీనికి కొనసాగింపుగా మరోచోట - వ్యాపారమయమైపోతున్న క్షణాల్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తాడు.
''వ్యాపార విష సంస్కృతి రెక్కలు చాస్తుంటే
ఉనికి ప్రశ్నలు మొలుస్తున్నాయి'' అని అంటున్నప్పుడు - బతుకు మీద భరోసాని కోల్పోతున్న సందర్భాన్ని చాలా విషాదభరితంగా చెప్పుకొస్తాడు. ప్రపంచీకరణ వేళ్లు అన్ని రంగాల్లోకి చొరబడి విష సంస్కృతి రూపంలో విస్తరించడాన్ని ప్రశ్నార్ధకంగా ప్రస్తావిస్తాడు గవిడి శ్రీనివాస్‌.
పెట్టుబడిదారి సమాజం కారణంగా స్వేచ్ఛని, తీరికనీ, సుఖసంతోషాల్నీ కోల్పోతున్న ఆధునిక మానవుడు తన సహజ స్థితిని చేరుకోవడానికి కాసింత విరామం అవసరం. కళాత్మక సౌందర్య దృష్టిని ఆస్వాధీంచగలగడం - అలసిన దేహాలతో పాటు మనసుకీ ఊరటనిస్తుంది. ఈ తరుణంలో శ్రీనివాస్‌ ఎంచుకున్న పదచిత్రాలు పాఠకుల మీద చెరగని ముద్ర వేస్తాయి. కవితను దృశ్యీకరించే పద్ధతిలో ఒక బలమైన ఊహాశక్తిని సరళమైన పదబంధాల మధ్య పొందుపరుస్తాడు. ఈ క్రమంలో తనదైన నిర్మాణ పద్ధతిని ప్రదర్శిస్తాడు.
''ఊగే ఈ గాలిలో/ ఈ నేలలో/ గుండెను తడిపే
విశ్వజనీన భాష ఏదో ఉంది'' అని అంటాడు మరో చోట.
ఒక సందర్భాన్ని కవిత్వం చెయ్యడం, దృశ్యమానంగా కొనసాగించడం సాధనతో సాధ్యమయ్యే పని. స్వతహాగా భావుకుడైన గవిడి శ్రీనివాస్‌కి ఈ ప్రయత్నం వెన్నతో పెట్టిన విద్యలోచూపుతో పదును తీరిన అంతర్వీక్షణ దృష్టి కొత్తకోణాల్ని స్పృశిస్తుంది. సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశీలనా శక్తికి పరీక్ష పెడుతుంది. ఈ దశలన్నింటినీ నెగ్గుకు రావడానికి పైకి కనిపించని మూల సూత్ర రహస్యాన్ని విభిన్న పార్శ్వాల్లో మన ముందు పరుస్తాడు శ్రీనివాస్‌.
'నేను లేత సూర్యుడు' కవితలో శ్రీనివాస్‌ ప్రదర్శించిన నేర్పు సహజ సౌందర్యాన్ని ధ్వనింపజేసి కళ్లకాంతులు మిరమిట్లు గొలిపేలా చేస్తుంది.
''నెమ్మదిగా తలూపే చెట్టునూ/రాల్తున్న మందుముత్యాల్ని
ఎగురుతున్న హరివిల్లులా / పక్షుల గుంపుల్ని/ నిశ్శబ్దంగా కళ్లు మూసుకొని - దృశ్యాన్ని నాలో వీక్షిస్తున్నాను'' అంటూ ఒక గాఢానుభూతిలోకి మనల్ని లాక్కెళ్ళిపోతాడు. పోలికలు చెప్పడంలో అనిర్వచనీయమైన ఆనంద పారశ్యంతో అంతరాల పొరల్ని చీల్చుకొని మమేకమైపోవడాన్ని గమనిస్తాం. ఇలా ఎక్కడపడితే అక్కడ.. ఈ సంపుటి నిండా కవిత్వం ధారలు కడుతుంది. వీటిలో మచ్చుకు కొన్నింటిని రుచి చూద్దాం.
''నీ జ్ఞాపకాల సమాధిలో / ఒక నీవు సాక్షిగా/ రాలిన నేను'', ''క్షణాల్ని ఢ కొంటూ/ చలి జ్వరాన్ని వాటేసుకున్నట్టు/ పల్లె నిశ్శబ్దంగా వొణుకుతోంది'', ''జొన్నసేను రేకుల్లో/ మబ్బుకళ్లు జార్చిన పన్నీరే/ ఈ చిట్టి చినుకులు'', ''ఒళ్ళంతా పరిమళమే/ మేఘాల్ని ముద్దాడితే/ మౌనాన్ని వీడి చినుకు చిత్తడి చేయదూ, ''ప్రపంచీకరణ ఇంద్రజాలం/ భూములకి రెక్కలిచ్చి/ ఆశల్ని ఆకాశానికి వేలాడదీస్తున్నాయి'', ''కాలానికి తెడ్లు కట్టి/ నావ దూకినపుడే/ బతుకులో ఉషోదయానికి తెర తీసినట్టవుతుంది'', ''వేణువులోంచి జారే/ రాగమాలిక నీ స్వరం/ కానీ ఇపుడు వినిపించని దారుల్లో'', '' నడిరాతిరి నీ జ్ఞాపకాలు/ ఉషస్సునే కలగంటాయి'' వంటి కవితా వాక్య నిర్మాణాలు స్తబ్దుగా నిద్రపోతున్న చీకటి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. వత్తానమ్మా, నాయనలారా ఎళ్లొత్తాన్రా కవితలు ఉత్తరాంధ్ర మాండలిక శైలిని ప్రతిబింబిస్తాయి.
ఎంతో గాఢత నిండిన ఈ కవితలు స్పష్టతను నింపుకొని, వస్తు విస్త్రృతిని పెంచుకొంటే భవిష్యత్తుని మరిన్ని కొత్తమలుపులు తిప్పుకొనే శక్తివుంది ఈ కవికి. సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాల్ని, విధ్వంసాన్ని గుర్తెరిగి, అధ్యయనంతో ముందుకు దూసుకుపోతే, కవిత్వపు నడక నల్లేరుపై బండినడకలా సాగిపోతుంది. ఈ దిశగా గవిడి శ్రీనివాస్‌ అడుగులు చైతన్యవంతమైన పాత్రను పోషించాలని కోరుకుందాం!
- మానాపురం రాజా చంద్రశేఖర్‌
94405 93910

No comments:

Post a Comment