Wednesday 24 June 2015

కన్నుల్లో వర్షం

Sun, 26 Dec 2010, IST    vv
సన్నసన్నగా జాలువారుతూ
రెప్పల మీద తూనీగల్లా వాలింది వర్షం.
గలగలా గాజుల శబ్దంలా
చెవిలో హోరు రాగాలు
పెళ్ళి కూతురిలా ముస్తాబైన వాన
వరద సామ్రాజ్యానికి రాజులా
పాత ప్రపంచాన్ని తుడుస్తూ
కొత్త లోకానికి మార్గమవుతుంది
పుడమి వొడిలో
సరికొత్త పచ్చని కాంతులు ఉదయిస్తాయి
చినుకు చిటపటల్లో
కొత్తరాగాలు ధ్వనిస్తున్నాయి
ఆస్వాదించాలే గానీ
తడవడం ఒక సుందర దృశ్యం
తేనె ధారలు కురుస్తున్నట్లు
చిరుదరహాసం మీద
కురుల సోయగాలు విరబూస్తున్నట్లు
మెలికలు తిరిగిపోతున్న వర్షం
చెట్లు తలాడిస్తూ
ఇంధ్రధనస్సుల్ని వెదుకుతున్నాయి
కళ్ళల్లో మెరుపులు
లేత యవ్వనాల తీగల్ని శృతి చేస్తున్నాయి
ఇక ఈ వానతో లోలోన జ్ఞాపకాల
జల్లులూ కురుస్తున్నాయి
చినుకు చిగురించాక
కన్నుల్లో వర్షం దృశ్యంగా కదిలాక
మనసు మొలకెత్తకుండా ఉండనూ లేదు.్‌
- గవిడి శ్రీనివాస్‌

No comments:

Post a Comment