Tuesday 23 June 2015

గవిడి 'వలస పాట'

Posted On Mon 01 Jun 13:49:27.206102 2015

                 విశాఖపట్నం సాహితీ స్రవంతి ప్రచురణగా వెలువడిన కవితా సంపుటిలో 50 కవితలున్నాయి. మనసు వదిలి వలస పోని ''మట్టిపాట'' అంటూ అద్దేపల్లి రామమోహన్‌ రావు, మరలా ప్రకృతి దగ్గరికి అంటూ కె. శివారెడ్డి చక్కటి విలువైన ముందు మాటలు రాశారు. పాఠకుల్ని ప్రకృతి దగ్గరికి , సౌందర్యం దగ్గరికీ శ్రీనివాస్‌ అక్షరంతో తీసుకెళ్తారు. 'రంగుల పక్షిలా పరవశించి అనురాగ రాగాన్ని అలంకరించాను/ కాలం వొడిలో మనం గాఢంగా మౌనంగా/ మనసులు మార్పిడి చేసుకున్నాం అంటారు 'నీ జ్ఞాపకాల పొరల్లో' అనే కవితలో. 'నక్షత్రాల పువ్వుని నీటి దోసిళ్ళలోనే దాచా/ మనో వీధిలో పుష్పక విమాన మెక్కి/ నే జాతర చేస్తున్నట్లు అవిరాళ భావాల మధ్య/ శీతల సుందరిని ముస్తాబు చేస్తూ ఈ సంధ్యను ముగిస్తాను' అంటారు 'ఒక శీతల సాయంత్రం'లో. 'నీరెండిన గుండె ఎడారిలో/ విజయం అలల తాకిడి / తీరాన్ని చేరుస్తుంది. మనస్సుల్ని రంజింప చేస్తుంది' అని 'అలల తాకిడి' అనే కవితలో. ఇలా ప్రతి పంక్తిలో అలంకారమో, భావ చిత్రమో, వర్తమాన సామాజిక వైరుధ్యమో కనిపిస్తాయి. 'ఒక వీడ్కోలు' అనే కవితలోని చివరి వాక్యాలు పాఠకుణ్ని ఆర్తితో ఆలోచింపజేస్తాయి. 'కరెన్సీ భాషలో కొలవలేని/ కాలం చూరులోంచి జారే రసామృతాన్ని/ ప్రశ్నార్థకంగా వదిలి/ హృదయాన్ని ట్రాలీలో మోసుకుపోతూ/ ఈ జీవచ్ఛవాన్ని విడిచి, రెక్కలు కట్టుకు ఎగిరిపోతావ్‌' ఇలా అన్ని కవితలు భావస్ఫోరకంగా ఉన్నాయి.
- తంగిరాల చక్రవర్తి
31-may-2015 prajasakti

No comments:

Post a Comment