Wednesday 24 June 2015

నీరైపోనూ...!

Sun, 11 Apr 2010, IST    -గవిడి శ్రీనివాస్‌
జొన్నసేను రేకుల్లో
మబ్బుకళ్ళు జార్చిన
పన్నీరే ఈ చిట్టిచినుకులు
పూవైపోదూ చిరునవ్వైపోదూ
చెరుకు జడల మధ్య
నిద్రను ఆరేసుకుంటే
తడి చినుకు గుండెను హత్తుకుంది
ప్రియురాలిలా! చిగురాకులా!!!
చూపులు పెనవేసుకున్నట్లు
చినుకులు అల్లుకుపోతున్నాయి
వాన
ధూళి తెరలు తీసి
అద్దంలాంటి
అరటాకు వనాల్ని ప్రసాదించింది
చినుకు విరిస్తే
కడిగేది హృదయాల్నీ సమస్త జీవరాశుల్నీ
జలాశయాల్నీ...
వాన తాకితే చాలు
బరువు మనిషి తేలికైనట్లు
తేలికమనిషి బరువౌతున్నట్లు
అంతర్గత సంద్రాలు
ఆహ్లాద కెరటాల్తో
తడిగాలులు వీస్తాయి
నీరుతగిలితే చాలు
మొలకెత్తుతాం
వటవృక్షమౌతాం
గూళ్ళు కట్టిన మబ్బులకి
చల్లని గాలులు
కొంగులతో ఊయలలూపుతాయి
గాలివీస్తే
వానలేస్తే
ప్రాణాలు ముద్దవుతుంటాయి
ఆకాశానికి రెక్కలుచాచి
బొంగరంలా
గిరికీలుకొడుతుంటే
సౌందర్యం శరీరమైనట్టు
శరీరమంతా హృదయమైనట్టు
మనసు పల్లకిలో
తేలియాడు తుంది
నేనుండగలనా
చినుకుల్ని ఛేదించగలనా
దోసిళ్ళలోంచి రాలే
చినుకుల్లా
ఒక్కధారగా
నీరైపోనూ...!
-గవిడి శ్రీనివాస్‌

No comments:

Post a Comment